పాలలో డిటర్జెంట్‌ కలిసిందా? ఇంట్లోనే ఇలా సులభంగా చెక్‌ చేసుకోండి

పాలలో డిటర్జెంట్‌ కలిసిందా? ఇంట్లోనే ఇలా సులభంగా చెక్‌ చేసుకోండి

Milk detergent adulteration check at home easily
  • 5-10 మిల్లీలీటర్ల పాలను గ్లాసులోకి తీసుకోవాలి
  • పాలను గట్టిగా షేక్‌ చేసి బుడగలను గమనించాలి
  • బుడగలు ఎక్కువసేపు ఉంటే కల్తీగా అనుమానించాలి
  • ఇంట్లో పరీక్ష తుది నిర్ధారణ కాదని గుర్తుంచుకోవాలి
ప్రతి ఇంట్లో నిత్యం ఉపయోగించే ఆహార పదార్థాల్లో పాలు ఒకటి. ఉదయం టీతో మొదలుకొని రాత్రి పడుకునే ముందు తాగే గ్లాసు వరకు పాలు ఉండాల్సిందే. అయితే పాల విషయంలో కల్తీ ఆందోళన కలిగిస్తోంది. పాలు పలుచగా కనిపించకుండా, నురుగు వచ్చేలా కనిపించేందుకు డిటర్జెంట్‌ వంటి పదార్థాలను కలుపుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరి మన ఇంట్లో వాడుతున్న పాలలోనూ డిటర్జెంట్‌ కలిసిందా? తెలుసుకోవడానికి ల్యాబ్‌ అవసరం లేదట. ఇంట్లోనే ఓ చిన్న పరీక్ష చేసుకోవచ్చని ఆహార భద్రతా అధికారులు చెబుతున్నారు. ఇంతకీ ఆ పరీక్ష ఏంటి? తెలుసుకుందాం..

ఓ చిన్న గ్లాసు చాలు
ముందుగా 5 నుంచి 10 మిల్లీలీటర్ల పాలను ఓ చిన్న గ్లాసులోకి తీసుకోండి. ఇప్పుడు దాన్ని గట్టిగా షేక్‌ చేయండి. ఆ తర్వాత పాలలో ఏం జరుగుతుందో కాసేపు గమనించండి. అంతే.. మీ ముందే ఓ సంకేతం కనిపిస్తుంది.

బుడగలు ఏం చెబుతున్నాయి?
షేక్‌ చేసిన వెంటనే బుడగలు ఏర్పడి త్వరగా మాయమైతే పాలలో డిటర్జెంట్‌ కల్తీ ఉన్నట్లు భావించాల్సిన అవసరం లేదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. అదే బుడగలు ఎక్కువగా ఏర్పడి కొంతసేపు అలాగే ఉంటే మాత్రం అనుమానించాల్సి ఉంటుంది. డిటర్జెంట్‌ కల్తీకి ఇది ఓ సూచన కావచ్చని పేర్కొంది.

బుడగలు ఎందుకు వస్తాయి?
ఇక్కడే అసలు విషయం ఉంది. డిటర్జెంట్లలో ఉండే సర్ఫాక్టెంట్లు ద్రవం ఉపరితల ఉద్రిక్తతను తగ్గిస్తాయి. దీంతో పాలను షేక్‌ చేసినప్పుడు ఏర్పడిన గాలి చుట్టూ పలుచని పొర ఏర్పడుతుంది. ఫలితంగా బుడగలు వెంటనే పగిలిపోకుండా ఎక్కువసేపు నిలుస్తాయి. స్వచ్ఛమైన పాలలో మాత్రం ఈ బుడగలు అంతగా నిలవవు.

పాలు కొనే ముందు..
కల్తీకి దూరంగా ఉండాలంటే నమ్మకమైన బ్రాండ్లను ఎంచుకోవడం మంచిది. ప్యాకెట్‌ లేదా కార్టన్‌ కొనేటప్పుడు సీల్‌ సరిగా ఉందో చూడాలి. పదార్థాల వివరాలను పరిశీలించాలి. ప్యాకెట్‌పై ఉన్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లోగోతో పాటు 14 అంకెల లైసెన్స్‌ నంబర్‌ను కూడా చెక్‌ చేసుకోవాలి.

అయితే ఇంట్లో చేసే ఈ పరీక్షను ప్రాథమిక సూచనగా మాత్రమే చూడాలి. పాలు కల్తీగా ఉన్నాయనే తుది నిర్ధారణకు అధికారిక పరీక్ష అవసరం. అయినప్పటికీ.. రోజూ తాగే పాల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండేందుకు ఈ చిన్న టెస్ట్‌ ఉపయోగపడుతుంది.
Advertisement
Milk
Detergent adulteration
Milk purity test
FSSAI food safety
Adulterated milk detection
Home milk quality check

More Telugu News