ప్రధాని మోదీ మెచ్చిన కడప రైతు.. యూట్యూబ్ చూసి అవకాడో సాగు.. యువ రైతు వరదరాజ్ సక్సెస్ స్టోరీ!

PM Modi praises Kadapa farmer Avocado cultivation success story of young farmer Varadaraj
  • కడప జిల్లా రైతు కర్ప వరదరాజ్‌పై 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని ప్రశంసలు
  • యూట్యూబ్ చూసి అవకాడో సాగుపై అవగాహన పెంచుకున్న పులివెందుల యువ రైతు
  • టమాటా, అరటిలో నష్టాలు రావడంతో ప్రత్యామ్నాయ పంటగా అవకాడోను ఎంచుకున్న వైనం
  • నాలుగేళ్ల క్రితం నాటిన మొక్కలు.. ఇప్పటివరకు నాలుగు టన్నుల దిగుబడి
  • ప్రధాని ప్రస్తావనతో తనకు, తన గ్రామానికి గొప్ప గుర్తింపు లభించిందంటూ హర్షం
సాధారణంగా కరవు ప్రాంతంగా, పరిమిత పంటలకే అనుకూలంగా ఉండే కడప జిల్లా పులివెందుల నుంచి ఓ యువ రైతు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, వినూత్న పంటను సాగు చేసి ఆయన సాధించిన విజయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇటీవల ప్రసారమైన 137వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని ఈ రైతు విజయగాథను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో కడప జిల్లాకు చెందిన 30 ఏళ్ల కర్ప వరదరాజ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. పులివెందులకు చెందిన వరదరాజ్ తన తల్లి, భార్య ప్రమీల, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో కలిసి వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. 2022 వరకు ఆయన కుటుంబం సంప్రదాయబద్ధంగా టమాటా, అరటి పంటలను సాగు చేసేది. అయితే ఆ ఏడాది పంట సరిగా పండకపోవడం, మార్కెట్లో ధరలు పడిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ అనుభవం ఆయన్ను కొత్త పంటల వైపు ఆలోచించేలా చేసింది. ఈ క్రమంలోనే ఆయన యూట్యూబ్ ద్వారా అవకాడో సాగు గురించి తెలుసుకున్నారు. మరింత శాస్త్రీయ పరిజ్ఞానం కోసం కర్ణాటక వెళ్లి అక్కడి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.

అవకాడో సాగు ఆలోచనను మొదట్లో తన కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని వరదరాజ్ తెలిపారు. "సంప్రదాయ పంటలనే కొనసాగించమని కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ నేను ధైర్యం చేసి నాలుగేళ్ల క్రితం నా పొలంలో అవకాడో మొక్కలు నాటాను. ఈ ఏడాది మార్చి నుంచి పంట చేతికి రావడం ప్రారంభమైంది. డబ్బులు కూడా రావడంతో మా కుటుంబంలో మళ్లీ సంతోషం వెల్లివిరిసింది" అని ఆయన ఆనందంగా వివరించారు. 

ఇప్పటివరకు ఆయన దాదాపు నాలుగు టన్నుల అవకాడో ఫలాలను పండించి, స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. నేరుగా మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

అయితే, ఇంతకంటే పెద్ద ఆనందం తనకు ఢిల్లీ నుంచి లభించిందని వరదరాజ్ అంటున్నారు. ప్రధాని మోదీ తన పేరును, తన ప్రయత్నాన్ని 'మన్ కీ బాత్'లో ప్రస్తావించడం తనకు మాటల్లో చెప్పలేని సంతోషాన్ని ఇచ్చిందన్నారు. 

"ప్రధాని నన్ను గుర్తించడంతో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్థుల మధ్య నాకు ఎంతో గుర్తింపు వచ్చింది" అని ఆయన ఉప్పొంగిపోయారు.

భారతదేశంలో ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయని, ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో అవకాడో వంటి పండ్లకు మార్కెట్లో గిరాకీ పెరుగుతోందని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వరదరాజ్ వంటి వినూత్న రైతులు ఈ అవకాశాలను అందిపుచ్చుకుని, సంప్రదాయ పంటలకు బదులుగా కొత్త పంటలు వేయడం ద్వారా తమ జీవనోపాధిని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. వరదరాజ్ విజయం గ్రామీణ భారతదేశంలో కొత్త అవకాశాలకు నిదర్శనమని ప్రధాని కొనియాడారు.
Advertisement
Karpa Varadaraj
Narendra Modi
Mann Ki Baat
Avocado Farming
Kadapa Farmer
Agricultural Success Story

More Telugu News