డోర్నకల్-గద్వాల రైల్వే లైన్‌కు కేంద్రం మెలిక.. వాటా ఇస్తేనే ముందడుగు

Dornakal Gadwal railway line center puts condition state share mandatory for progress
  • నిర్మాణ వ్యయంలో రాష్ట్రం వాటా భరించాలన్న కేంద్రం 
  • రూ.8,993 కోట్లతో 308 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు
  • రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడ్డ లైన్ భవిష్యత్తు
తెలంగాణలో చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న డోర్నకల్–గద్వాల నూతన రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు ఆమోదం తెలిపిన బోర్డు, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కీలక షరతు విధించింది. నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం వాటా భరించాలని స్పష్టం చేస్తూ, ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం.

ఈ ప్రతిపాదిత డోర్నకల్-గద్వాల మార్గంలో 308.28 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్‌ను నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.8,993.77 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. గతంలో ఈ మార్గం పొడవు 296 కిలోమీటర్లుగా ఉండగా, భూసేకరణ చిక్కులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనల మేరకు అలైన్‌మెంట్‌లో మార్పులు చేయడంతో దూరం పెరిగింది. ఈ ఏడాది మార్చి 31న సమర్పించిన సవివర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) పరిశీలించిన రైల్వే బోర్డు, ప్రాజెక్టు వ్యయం, నిర్వహణ, ఆదాయ మార్గాలను సమగ్రంగా విశ్లేషించింది.

మొత్తం నిర్మాణ వ్యయాన్ని రైల్వే శాఖ ఒక్కటే భరించడం సాధ్యం కాదని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని బోర్డు తేల్చిచెప్పింది. దీంతో దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలను అనుసంధానించే ఈ కీలక ప్రాజెక్టు భవితవ్యం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. కాగా, ఇదే ప్రాంతంలోని డోర్నకల్–మిర్యాలగూడ రైల్వే లైన్‌కు సంబంధించిన డీపీఆర్ కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉండటం గమనార్హం.
Advertisement
Dornakal Gadwal Railway Line
Telangana Railway Projects
Indian Railway Board
State Government Cost Sharing
South Telangana Infrastructure
Khammam Nalgonda Mahabubnagar Railway

More Telugu News