‘అదే నిజమైన విద్య’.. టీచర్స్‌ డేపై రామ్‌గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు!

That is true education Ram Gopal Varma sensational comments on Teachers Day
  • టీచర్‌ చెప్పింది గుడ్డిగా నేర్చుకోవడం విద్య కాదన్న వర్మ
  • విద్యార్థులు టీచర్లను ప్రశ్నించాలని వ్యాఖ్య
  • ఐన్‌స్టీన్‌, స్పీల్‌బర్గ్‌ ఉదాహరణల ప్రస్తావన
  • టీచర్లు అనుచరులను తయారు చేస్తున్నారని విమర్శ
  • స్వతంత్ర ఆలోచనను విద్యార్థులు కోల్పోతున్నారన్న వర్మ
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ ‘హ్యాపీ టీచర్స్‌ డే’ చెప్పడం లేదన్నారు. నిజమైన వ్యక్తి ఎప్పుడూ తనకు బోధించడాన్ని ప్రశ్నిస్తాడని అన్నారు. టీచర్‌ చెప్పింది గుడ్డిగా నేర్చుకోవడం విద్య కాదని వ్యాఖ్యానించారు.

‘బోధన’ పేరుతో విద్యార్థులను ఒకే దారిలో నడిపించడం సరికాదని వర్మ అభిప్రాయపడ్డారు. టీచర్‌ చెప్పేది తప్పని, కాలం చెల్లినదని విద్యార్థి గుర్తించినప్పుడే నిజమైన అభ్యాసం మొదలవుతుందని పేర్కొన్నారు.

తన వాదనకు ఐన్‌స్టీన్‌, స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ఉదాహరణలను వర్మ ప్రస్తావించారు. ప్రష్యన్‌ పాఠశాల విధానాన్ని ఐన్‌స్టీన్‌ ఇష్టపడలేదని చెప్పారు. అయినా తర్వాత సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని పేర్కొన్నారు. స్పీల్‌బర్గ్‌కు ఫిల్మ్‌ స్కూల్‌లో ప్రవేశం నిరాకరించారని, అయినా ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడిగా ఎదిగారని తెలిపారు. సిలబస్‌ను అనుసరించకుండా ముందుకు వెళ్లిన వారే కొత్త మార్గాలు చూపారని అన్నారు.

విజయవంతమైన ఇంజినీర్లు, వైద్యులు, న్యాయవాదులను చూశానని.. కానీ విజయవంతమైన టీచర్‌ను చూడలేదని వర్మ వ్యాఖ్యానించారు. ‘‘నిజమైన అభ్యాసం అంటే టీచర్‌ నేర్పించాలనుకున్న దాన్ని కూడా అవసరమైతే మర్చిపోవడం’’ అని అన్నారు.

టీచర్లు విద్యార్థులను స్వతంత్రంగా ఆలోచించే నాయకులుగా కాకుండా అనుచరులుగా తయారు చేస్తున్నారని విమర్శించారు. పిల్లలను టీచర్ల వద్దకు పంపే తల్లిదండ్రులు తెలియకుండానే వారి స్వతంత్ర ఆలోచనా శక్తిని దెబ్బతీస్తున్నారని అన్నారు.

జార్జ్‌ బెర్నార్డ్‌ షా, ఆస్కార్‌ వైల్డ్‌ వ్యాఖ్యలను కూడా వర్మ ప్రస్తావించారు. చివరగా తన అభిప్రాయానికి కొనసాగింపుగా ‘‘అందుకే మీకు ‘హ్యాపీ టీచర్స్‌ డే’ చెప్పాలని అనుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు.
Advertisement
Ram Gopal Varma
Teachers Day
RGV Comments
Education System
Albert Einstein
Steven Spielberg

More Telugu News