కావాలనే విమానాన్ని సముద్రంలో ముంచిన టర్కీ.. ఎందుకీ వింత ప్రయోగం?

Turkey intentionally sinks plane in sea for strange experiment
  • 2016లో ఎయిర్‌బస్‌ ఏ300ను సముద్రంలో ముంచిన టర్కీ
  • 22 మీటర్ల లోతులో 54 మీటర్ల విమానం
  • డైవింగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారిన ఎయిర్‌బస్‌ విమానం
  • డైవర్లకు కాక్‌పిట్‌లోకి ప్రవేశించే అవకాశం
  • సముద్ర జీవులకు కృత్రిమ ఆవాసం
విమానం సాధారణంగా ఆకాశంలో ఎగురుతుంది. కానీ టర్కీలోని ఓ భారీ ఎయిర్‌బస్‌ మాత్రం సముద్రం అడుగునకు చేరింది. పర్యాటకులను ఆకర్షించడంతో పాటు సముద్ర జీవులకు కృత్రిమ ఆవాసంగా మార్చేందుకు అధికారులు ఈ విమానాన్ని ఉద్దేశపూర్వకంగా ఏజియన్‌ సముద్రంలో ముంచారు. ఇప్పుడు అదే విమానం డైవింగ్‌ చేసే వారికి ప్రత్యేక ఆకర్షణగా మారింది.

టర్కీలోని ఐడిన్‌ ప్రావిన్స్‌లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతం కుషాదసి తీరానికి సమీపంలో ఈ ఎయిర్‌బస్‌ ఏ300ను 2016 జూన్‌లో సముద్రంలోకి దించారు. 54 మీటర్ల పొడవున్న విమానాన్ని సముద్రంలో సుమారు 22 మీటర్ల లోతులో ఇసుక నేలపై ఉంచారు. విమానం పూర్తిగా నీటిలోకి చేరేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టింది.

ఈ ఎయిర్‌బస్‌ ఏ300కు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1980లో ఫ్రాన్స్‌లోని టులూస్‌లో తయారైన ఈ విమానం అదే ఏడాది మార్చి 14న తొలిసారి గాల్లోకి ఎగిరింది. వేలాది విమాన ప్రయాణాలు పూర్తి చేసింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు గ్రీస్‌కు చెందిన ఒలింపిక్‌ ఎయిర్‌వేస్‌లో ప్రయాణికుల విమానంగా సేవలు అందించింది. ఆ తర్వాత కార్గో విమానంగా మార్చారు. 2006 నుంచి టర్కీలో కార్గో రవాణాకు ఉపయోగించారు.

తర్వాత నిర్వహణ, తనిఖీల ఖర్చులు పెరగడంతో విమానాన్ని సేవల నుంచి తప్పించారు. అయితే దాని ప్రయాణం అక్కడితో ముగియలేదు. ఐడిన్‌ మున్సిపాలిటీ ఓ ప్రైవేటు విమానయాన సంస్థ నుంచి ఈ 36 ఏళ్ల విమానాన్ని 2.70 లక్షల టర్కిష్‌ లిరాలకు కొనుగోలు చేసింది. అప్పట్లో దీని విలువ సుమారు 93 వేల డాలర్లుగా ఉంది.

విమానాన్ని సముద్రంలోకి దించే ముందు ప్రత్యేకంగా సిద్ధం చేశారు. ప్రమాదకరమైన భాగాలను తొలగించారు. గాజు, పదునైన అంచులు వంటి డైవర్లకు ప్రమాదం కలిగించే వస్తువులను తొలగించారు. అనంతరం ఇస్తాంబుల్‌ నుంచి రోడ్డు మార్గంలో కుషాదసికి తరలించి.. అక్కడ మరోసారి అమర్చి సముద్రంలోకి దించారు.

సముద్రంలోకి చేరిన తర్వాత ఈ విమానం కృత్రిమ రీఫ్‌గా పనిచేయడం మొదలుపెట్టింది. నీటి అడుగున ఇలాంటి నిర్మాణాల చుట్టూ సముద్ర జీవులు చేరే అవకాశం ఉంటుంది. కాలక్రమంలో మొక్కలు, ఇతర సముద్ర జీవులకు ఇది ఆవాసంగా మారుతుంది. మరోవైపు డైవింగ్‌ చేసే వారికి భారీ విమానంలోకి వెళ్లే అరుదైన అనుభవాన్ని అందిస్తోంది.

సుమారు 17 మీటర్ల లోతు నుంచి డైవింగ్‌ ప్రారంభించి విమానం దగ్గరకు చేరుకోవచ్చు. డైవర్లు విమానం పక్క భాగం నుంచి లోపలికి వెళ్లి దాని పొడవైన భాగంలో ప్రయాణించవచ్చు. కాక్‌పిట్‌ కూడా ప్రధాన ఆకర్షణగా మారింది. అసలు పరికరాలు, కేబుళ్లు, స్విచ్‌లను ముందే తొలగించినప్పటికీ.. డైవర్లు కాక్‌పిట్‌లోకి వెళ్లి మూడు సీట్లలో కూర్చోవచ్చు. సముద్రపు తుపాన్లను తట్టుకునేలా విమానాన్ని సముద్రపు అడుగుభాగానికి బలంగా అమర్చారు.

డైవింగ్‌ పర్యాటకాన్ని పెంచేందుకు టర్కీ గతంలో మూడు చిన్న విమానాలను కూడా సముద్రంలో ముంచింది. అయితే 54 మీటర్ల పొడవు, సుమారు 44-45 మీటర్ల రెక్కల వెడల్పు ఉన్న ఈ ఎయిర్‌బస్‌ ఏ300 వాటన్నింటికంటే పెద్దది. టర్కీలో ఇంత భారీ విమానాన్ని ఉద్దేశపూర్వకంగా సముద్రంలోకి దించడం ఇదే తొలిసారి.
Advertisement
Turkey
Airbus A300
Aegean Sea
Artificial Reef
Diving Tourism
Kusadasi

More Telugu News