జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ నిరసన.. సజ్జలపై ఆరోపణలు
- తాడేపల్లిలోని జగన్ నివాసం ముందు బోరుగడ్డ నిరసన
- సజ్జల తన అనుచరులతో కలిసి జగన్ ను కలవకుండా అడ్డుకుంటున్నారని మండిపాటు
- తాను రౌడీ షీటర్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి నిరసనకు దిగడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. గతంలో తనను వైసీపీ నేతగా చెప్పుకున్న అనిల్‌తో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని గతంలోనే ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. అయితే తాజాగా జగన్ నివాసానికి చేరుకున్న ఆయన, పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనను జగన్ ఇంటికి వెళ్లకుండా సజ్జల తన అనుచరులతో కలిసి అడ్డుకుంటున్నారని, అంతేకాకుండా తనపై 'రౌడీషీటర్' అని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని బోరుగడ్డ అనిల్ మండిపడ్డారు. తనపై ఎలాంటి రౌడీషీట్ లేదని హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. ఈ వ్యవహారంలో 12 మంది పోలీసులకు కోర్టు మెమో ఇచ్చిందని తెలిపారు.
తాను లండన్‌లో పీజీ పూర్తి చేశానని, తండ్రి మరణం తర్వాత ఇక్కడికి వచ్చి జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా కష్టపడ్డానని అన్నారు. వైఎస్సార్ సమాధి వద్ద ప్రమాణం చేసి మరీ పార్టీ కోసం పనిచేశానని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు సైతం తన ఇంటికి వస్తారని చెప్పుకొచ్చిన ఆయన, తనపై నిందలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.