నిరుద్యోగ సంక్షోభం.. మోదీ సర్కార్‌కు పెనుసవాల్.. బీబీసీ ప్రత్యేక కథనం!

Modi Government faces big challenge as unemployment crisis worsens
  • పరీక్ష పత్రాల లీక్‌పై యువత ఆగ్రహం.. కేంద్ర మంత్రి రాజీనామా
  • దేశంలో తీవ్రమవుతున్న నిరుద్యోగ సంక్షోభంపై నిపుణుల ఆందోళన
  • విద్యా వ్యవస్థ వైఫల్యం, పడిపోతున్న ఉపాధి అవకాశాలు
  • మోదీ సర్కార్‌కు దీర్ఘకాలిక సవాల్‌గా మారిన యువత అసంతృప్తి
పరీక్ష పత్రాల లీకేజీ ఉదంతాలపై దేశవ్యాప్తంగా యువత నిరసనలతో అట్టుడగడంతో, గత నెలలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామంతో మోదీ ప్రభుత్వం తాత్కాలికంగా సంక్షోభం నుంచి గట్టెక్కినప్పటికీ, యువతలో పేరుకుపోతున్న అసంతృప్తి భవిష్యత్తులో ప్రభుత్వానికి దీర్ఘకాలిక సవాల్‌గా మారనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీ ఓ కథనం వెలువరించింది.

లీకేజీ కేసుల విచారణ నిమిత్తం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని, పరీక్షా వ్యవస్థలో సంస్కరణల కోసం టెక్ నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో కమిటీని నియమిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అయినప్పటికీ, తగిన ఉపాధి అవకాశాలు కల్పనలోనూ, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యంతో కూడిన విద్యను అందించడంలోనూ విఫలమవుతున్న ప్రస్తుత వ్యవస్థపై యువతలో అసహనం పెరుగుతోంది. వారి ఆందోళనలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం మరింత నిర్మాణాత్మకమైన ప్రయత్నాలు చేయాల్సి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రముఖ ఆర్థికవేత్త సంతోష్ మెహ్రోత్రా బీబీసీతో మాట్లాడుతూ, "గత దశాబ్ద కాలంలో కార్మిక మార్కెట్ స్థితుగతులు క్షీణించాయి. వ్యవసాయేతర ఉద్యోగాల సృష్టి మందగించడంతో పాటు, వాస్తవ వేతనాలు కూడా స్తంభించిపోయాయి" అని వెల్లడించారు. బలహీనమైన ఆర్థిక వ్యవస్థ వల్ల ఉద్యోగాలకు గిరాకీ పెరగడం లేదని, మరోవైపు మన విద్యా వ్యవస్థ సైతం నాణ్యమైన మానవ వనరులను అందించడంలోవెనుకబడి ఉందని ఆయన విశ్లేషించారు.

అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ 'స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026' నివేదిక ప్రకారం, ప్రస్తుతం పట్టభద్రుల్లో నిరుద్యోగిత రేటు గత 25 ఏళ్ల నాటి తరహాలోనే 35-40 శాతం వద్ద కొనసాగుతోంది. అయితే, పెరిగిన జనాభా దృష్ట్యా సమస్య తీవ్రత మరింత అధికంగా కనిపిస్తోంది. 2023 నాటికి 67 శాతం మంది గ్రాడ్యుయేట్లకు సరైన ఉపాధి లేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. అదేవిధంగా, జీడీపీలో తయారీ రంగం వాటా 17 శాతం నుంచి 14 శాతానికి తగ్గడం, కృత్రిమ మేధ (ఏఐ) రాకతో ఐటీ రంగంలో నియామకాలు మందగించడం ఈ సంక్షోభాన్ని మరింత జఠిలం చేస్తున్నాయి.

కేవలం ఏసీ కార్యాలయాల్లోని ఉద్యోగాలనే ఆశించకుండా, నైపుణ్యం ఆధారిత వృత్తులైన ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్ వంటి పనులను కూడా చేపట్టేందుకు యువత సిద్ధపడాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత యువత తమ తల్లిదండ్రుల కంటే మెరుగైన జీవన ప్రమాణాలను పొందలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఇది దేశానికి పెను ముప్పుగా పరిణమించకుండా మోదీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Advertisement
Narendra Modi
India Unemployment Crisis
Graduate Unemployment Rate
Indian Job Market
Paper Leak Protests

More Telugu News