ప్రపంచంలో రెండో స్థానంలో భారత్.. నిద్రలేమిలో ఆందోళనకర రికార్డు

India ranks second globally in sleep deprivation alarming health record
  • నిద్రలేమి సమస్యలో జపాన్ తర్వాత రెండో స్థానంలో నిలిచిన భారత్
  • డయాబెటిస్, గుండె జబ్బులకు నిద్రలేమే ప్రధాన కారణమంటున్న వైద్యులు
  • పదిలో ఆరుగురు భారతీయులకు 6 గంటల కంటే తక్కువ నిద్రేనని సర్వేలో వెల్లడి
  • రాత్రిపూట ఫోన్లు, ఆలస్యంగా భోజనం నిద్రను దెబ్బతీస్తున్న ప్రధాన కారణాలు
  • ఆరోగ్యకరమైన నిద్ర కోసం జీవనశైలిలో మార్పులు అవసరమని సూచన
భారతీయులు ఎదుర్కొంటున్న తీవ్రమైన నిద్రలేమి సమస్య దేశంలో ఆరోగ్య సంక్షోభానికి దారితీస్తోందని ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల డయాబెటిస్, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు గణనీయంగా పెరుగుతున్నాయని, కొన్ని సందర్భాల్లో ఇది ఐసీయూలో చేరేంత తీవ్రమైన పరిస్థితులకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత నిద్రలేమితో బాధపడుతున్న దేశాల జాబితాలో జపాన్ తర్వాత భారత్ రెండో స్థానంలో ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని పదిలో ఆరుగురు వయోజనులు రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారని, 2022 నుంచి ఈ సంఖ్య మరింత పెరిగిందని ఆ సర్వే తేల్చింది. ఆరోగ్యకరమైన వయోజనులకు రోజుకు కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర అవసరమని వైద్య మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.

నిద్ర అనేది శరీరానికి ఓ మరమ్మతు ప్రక్రియ లాంటిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్ర సమయంలోనే మెదడులోని వ్యర్థాలు తొలగిపోతాయని, హార్మోన్లు సమతుల్యం అవుతాయని, అవయవాలు విశ్రాంతి తీసుకుంటాయని తెలిపారు. దీర్ఘకాలికంగా నిద్ర సరిగ్గా లేకపోతే శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ దెబ్బతింటుంది, కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు పెరిగి డయాబెటిస్, ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అంతేగాక‌ ఏకాగ్రత, మానసిక స్థితి, రోగనిరోధక శక్తి కూడా క్షీణిస్తాయి. రోజుకు మూడు, నాలుగు గంటల నిద్రతో గడిపేస్తున్నామని గొప్పగా చెప్పుకునే వారు భవిష్యత్తులో ఐసీయూలో చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు.

రాత్రిపూట ఆలస్యంగా భారీగా భోజనం చేయడం, నిద్రకు 7-8 గంటల ముందు కెఫిన్ తీసుకోవడం, సాయంత్రం పూట తీవ్రమైన వ్యాయామం, మద్యం సేవించడం, మొబైల్ ఫోన్లు వంటి స్క్రీన్ల నుంచి వెలువడే నీలి కాంతి నిద్రను తీవ్రంగా దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.

ఈ సమస్యను అధిగమించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రకు కనీసం మూడు గంటల ముందు భోజనం పూర్తిచేయాలని, బెడ్‌రూమ్‌లో ఫోన్లు వాడకుండా బయట చార్జింగ్ పెట్టాలని, నిద్రకు గంట ముందు ఇంట్లో లైట్ల వెలుతురు తగ్గించాలని, గదిని చల్లగా ఉంచుకోవాలని సలహా ఇచ్చారు. ఉదయాన్నే సూర్యరశ్మిలో కాసేపు నిలబడటం కూడా బయోలాజికల్ క్లాక్‌ను సరిచేస్తుందని తెలిపారు. తక్కువ నిద్రపోవడాన్ని ఉత్పాదకతకు చిహ్నంగా భావించే సంస్కృతి నుంచి బయటపడి, ఆరోగ్యానికి నిద్ర ఎంత ముఖ్యమో ప్రతిఒక్కరూ గ్రహించాలని సూచించారు.
Advertisement
India
Sleep Deprivation
Insomnia Health Crisis
Lifestyle Diseases
LocalCircles Survey
Sleep Disorders

More Telugu News