తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. జూలై 15 నుంచి కొత్త ఆరోగ్య పథకం

Good news for Telangana government employees new health scheme from July 15
  • ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన, నగదు రహిత వైద్యమే లక్ష్యం
  • ఉద్యోగ దంపతుల్లో ఒకరి జీతం నుంచే కంట్రిబ్యూషన్ వసూలుకు నిర్ణయం
  • త్వరలోనే ఆసుపత్రుల జాబితా, ప్యాకేజీ రేట్లను ప్రకటించనున్న ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన, క్రమబద్ధమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను జూలై 15న ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో నగదు రహిత వైద్య సదుపాయం కల్పించనున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధ్యక్షతన ఇటీవల జరిగిన ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్ట్ సమావేశంలో పథకం ప్రారంభ తేదీని ఖరారు చేశారు. వారం రోజుల్లోగా వివిధ ఆసుపత్రుల యాజమాన్యాలతో ట్రస్ట్ సభ్యులు కీలక భేటీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత నూతన ఈహెచ్ఎస్ మార్గదర్శకాలు, చికిత్సల ప్యాకేజీ ధరలు, ఎంప్యానెల్ చేసిన ఆసుపత్రుల తుది జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు.

ఈ పథకంలో భాగంగా ఉద్యోగుల ప్రయోజనార్థం ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైన పక్షంలో, వారిలో ఒకరి వేతనం నుంచి మాత్రమే హెల్త్ కంట్రిబ్యూషన్‌ను మినహాయించనున్నారు. ఈ నిర్ణయం వల్ల అటువంటి ఉద్యోగ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుంది. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణలో పూర్తి పారదర్శకతను నిర్ధారిస్తూ, ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకంగా 'ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌'ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రస్ట్ పర్యవేక్షణలోనే నూతన ఆరోగ్య పథకం అమలు కానుంది.
Telangana Government
Employees Health Scheme EHS
Telangana Pensioners Health Benefits
Cashless Medical Services

More Telugu News