భాగ్యరాజ్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు: పవన్ కల్యాణ్

Bhagyaraj created an empire for himself says Pawan Kalyan
  • భాగ్యరాజ్ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
  • స్క్రీన్‌ప్లే కింగ్ గా భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేశారని కితాబు
  • ఆయన సినిమాలను మలిచిన తీరు ఒక తరం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని వ్యాఖ్య

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా కోలీవుడ్‌లో ఒక అద్భుతమైన శకం ముగిసింది. తన విలక్షణమైన స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ ఈ ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.


భాగ్యరాజ్ గారు కేవలం దర్శకుడే కాదు... ‘స్క్రీన్‌ప్లే కింగ్’గా ఇండియన్ సినిమాలో చెరగని ముద్ర వేశారని పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. ఒక సాధారణ సహాయ నటుడిగా, రచయితగా సినీ ప్రస్థానం ప్రారంభించిన భాగ్యరాజ్.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌గా, హీరోగా తనదైన ముద్ర వేశారన్నారు. చిత్ర రంగంలో భాగ్యరాజ్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఆయన కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఎన్నో క్లాసిక్ సినిమాలు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ అయి విజయాలు అందుకున్నాయని కొనియాడారు.


ప్రేమ, మధ్యతరగతి కుటుంబాల ఎమోషన్స్, హ్యూమర్‌ను సరికొత్తగా మిక్స్ చేస్తూ ఆయన సినిమాలు మలిచిన తీరు ఒక తరం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుందని పవన్ అన్నారు. మన పక్కింటి అబ్బాయిలాంటి పాత్రలతోనే ఆయన మెప్పించారన్నారు. ఈ విషాద సమయంలో భాగ్యరాజ్ కుటుంబ సభ్యులకు (భార్య పూర్ణిమ, కుమారుడు శాంతను, కుమార్తె శరణ్య) భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

K Bhagyaraj
Pawan Kalyan
Screenplay King
Tamil Director Death
Kollywood News
Chennai

More Telugu News