అద్దెకు ఇల్లు తీసుకుంటున్నారా? అగ్రిమెంట్ లో ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలించండి!

Rental Agreement Points to Check Carefully Before Renting a House
  • అద్దె ఒప్పందాలలో కనిపించని ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
  • రెండు నెలల అద్దెకు మించి డిపాజిట్ అడగరాదంటున్న మోడల్ టెనెన్సీ యాక్ట్
  • ఒప్పందంలో లేని ఛార్జీలు, మధ్యలో అద్దె పెంపునకు చట్టబద్ధత ఉండదు
  • పెద్ద మరమ్మతుల బాధ్యత ఇంటి యజమానిదేనని చెబుతున్న నిబంధనలు
  • సంతకం చేసే ముందు అన్ని నిబంధనలను క్షుణ్ణంగా చదవడం తప్పనిసరి
ఇల్లు అద్దెకు తీసుకోవడమంటే కేవలం నెలవారీ అద్దె చెల్లించడంతోనే బాధ్యత ముగిసిపోదు. ఒప్పందం సమయంలో వెల్లడించని అనేక అదనపు ఖర్చులు సామాన్యుల బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేస్తున్నాయి. భారీ సెక్యూరిటీ డిపాజిట్లు, ఊహించని మెయింటెనెన్స్ ఛార్జీల అద్దెదారులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో, అద్దె ఒప్పందంపై సంతకం చేసేముందే నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం అత్యవసరం.

అద్దెదారుల హక్కులు పరీరక్షణార్థం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మోడల్ టెనెన్సీ యాక్ట్ 2021' ప్రకారం, ఇంటి యజమానులు రెండు నెలల అద్దెకు మించి సెక్యూరిటీ డిపాజిట్‌ వసూలు చేయకూడదు. 

అద్దెదారు ఇల్లు ఖాళీ చేసిన వెంటనే సదరు డిపాజిట్‌ను తిరిగి చెల్లించాలి. ఒప్పందంలో ముందస్తుగా పేర్కొనకుండా మధ్యంతరంగా అద్దె పెంచడం నిబంధనలకు విరుద్ధం. 

అలాగే, ఇంటికి సంబంధించిన ప్రధాన మరమ్మతులు, వైట్‌వాషింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ పనుల బాధ్యత యజమానిదే. తాళాలు, కుళాయి వాషర్లు మార్చడం వంటి చిన్నచిన్న పనుల బాధ్యత మాత్రమే అద్దెదారుపై ఉంటుంది.

పార్కింగ్, పెంపుడు జంతువుల రుసుము, యుటిలిటీ బిల్లులు వంటి ఇతర ఛార్జీల విషయంలో ముందే స్పష్టత తీసుకోవాలి. అన్ని రకాల ఖర్చులను లిఖితపూర్వకంగా ఒప్పందంలో పొందుపరచాలని పట్టుబట్టడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే ఆర్థిక వివాదాలను, మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా నివారించవచ్చు.

అయితే, అసోం మినహా దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు ఈ నూతన చట్టాన్ని ఇంకా పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ పాత చట్టాలే అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో, అద్దె ఒప్పందంలోని ప్రతి నిబంధనను క్షుణ్ణంగా చదవడం చాలా ముఖ్యం.
Go Back to Shorts
Rental Agreement
Model Tenancy Act 2021
Security Deposit
Tenant Rights
House Renting Tips

More Telugu News