ముఖ్యమంత్రి విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు.. అసెంబ్లీలో విడాకుల ప్రస్తావన!

Udhayanidhi Stalin personal attack on CM Joseph Vijay and divorce mention in Assembly
  • విజయ్ విడాకుల కేసును పరోక్షంగా ప్రస్తావించిన ప్రతిపక్ష నేత
  • కోర్టులో భార్య కోసం భార్య వెతికే కథ తెలుసన్న ఉదయనిధి
  • ఈ విషయం తమిళ ప్రజలకు తెలుసని వ్యాఖ్య
  • డీఎంకే పాలన, కుటుంబ రాజకీయాలపై విజయ్ విమర్శలకు కౌంటర్
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్.. ముఖ్యమంత్రి విజయ్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. ముఖ్యమంత్రి విజయ్ విడాకుల అంశాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించడంతో సభలో తీవ్ర దుమారం రేగింది.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. తొలుత ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ, హిందీ వివాదం, నీట్, రైతుల నిరసనలు, కరూర్ తొక్కిసలాట వంటి పలు అంశాలను ప్రస్తావించారు. రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని, తమ ప్రభుత్వ విధానాలను అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. గత డీఎంకే ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించిందని విమర్శించారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ హావభావాలను అనుకరిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అనంతరం ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి విజయ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. రైతుల గౌరవాన్ని దెబ్బతీసేలా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం వల్లే రైతులు నిరసనలు తెలుపుతున్నారని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

ఉదయనిధి తన ప్రసంగంలో "ఒక చిన్న కథ చెబుతా" అంటూ.. చెంగల్‌పట్టు కోర్టులో తన భర్త కోసం ఓ భార్య వెతుకుతోందని, ఈ విషయం తమిళ ప్రజలందరికీ తెలుసని పేర్కొంటూ విజయ్ వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి విజయ్ భార్య సంగీత, ఫిబ్రవరి 24న చెంగల్‌పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 7న జరగనుంది.

ముఖ్యమంత్రి విజయ్ తన ప్రసంగంలో డీఎంకే నేతృత్వంలోని గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం నేతల వలె తాము ప్రజాధనాన్ని దోచుకోమని స్పష్టం చేశారు. అలాగే ఒక కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వడం తమ రాజకీయ విధానం కాదని, తమిళనాడులోని ప్రతి కుటుంబానికి సేవలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Go Back to Shorts
Joseph Vijay
Udhayanidhi Stalin
Tamil Nadu Assembly
CM Vijay Divorce Case
Sangeetha Vijay
Tamil Nadu Politics

More Telugu News