పెళ్లి వద్దని చెప్పడం కంటే చంపడమే ఈజీ అనిపించిందట.. పుణే హత్య కేసులో షాకింగ్ నిజాలు!
- పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు!
- పెళ్లి రద్దు చేస్తే కుటుంబ సభ్యులు భాధపడతారని భావించిన సియా
- దానికంటే చంపడమే సులభమని ఆలోచించినట్లు విచారణలో వెల్లడి!
- ప్రియుడితో సియా గోయల్ 2 వేలకుపైగా ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తింపు
తన ప్రేమికుడు చేతన్ చౌదరితో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చిన విషయం తెలిసిందే. నవంబర్‌లో జరగాల్సిన పెళ్లిని రద్దు చేస్తే కుటుంబ సభ్యులు బాధపడతారని భావించి.. ఈ నిర్ణయం తీసుకున్నానని సియా చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ కేసు దర్యాప్తు కోసం పుణే, లోనావాలా పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సియా తల్లిదండ్రులను లోనావాలా సిటీ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. ఆమె సోదరుడు సాహిల్ గోయల్‌ను కూడా రెండోసారి ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే సాహిల్‌ను దాదాపు 10 గంటల పాటు విచారించిన పోలీసులు.. సియా, చేతన్ పరిచయం గతేడాది దీపావళి వేడుకల్లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడిందని గుర్తించారు. ఆ తర్వాత ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటూ ప్రేమలో పడ్డారని దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
జనవరి నుంచి ఇప్పటివరకు ఇద్దరి మధ్య 2 వేలకుపైగా ఫోన్ కాల్స్ జరిగినట్లు, మొత్తం 238 గంటల పాటు మాట్లాడుకున్నట్లు కాల్ రికార్డులు వెల్లడిస్తున్నాయని పోలీసులు తెలిపారు. అయితే చేతన్‌తో తమ కుమార్తెకు ఎలాంటి సంబంధం లేదని సియా తల్లిదండ్రులు చెబుతున్నారు. అతడు కేవలం స్నేహితుడేనని ఆమె న్యాయవాది వాదిస్తున్నారు. ఇద్దరి మొబైల్ ఫోన్లలో డిలీట్ చేసిన డేటాను రికవరీ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. అలాగే ఈ పెళ్లి కుదిర్చిన మధ్యవర్తులను కూడా విచారిస్తున్నారు.