సాయికృష్ణ అదృశ్యం... వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ ఫైర్

Pawan Kalyan slams YSRCP leaders over Sai Krishna missing case
  • క్రిమినల్స్‌కు కులం అంటగట్టే సంస్కృతిని తీవ్రంగా ఖండించిన పవన్ కల్యాణ్
  • యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన సాయికృష్ణను వెనకేసుకురావడంపై మండిపాటు
  • బీసీలు ఐక్యంగా ఉండి, అడిగే స్థితి నుంచి ఇచ్చే స్థాయికి ఎదగాలని పిలుపు
  • సంక్షేమం పేరుతో గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలను నాశనం చేసిందని విమర్శ
  • నిజమైన కార్యకర్తలను గుర్తించి, నాయకులుగా తీర్చిదిద్దేందుకే పార్టీ నిర్మాణ కమిటీలు
జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుల రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరస్థులకు, క్రిమినల్స్‌కు కులం రంగు పులిమి రాజకీయ ప్రయోజనం పొందాలని చూసే సంస్కృతిని తీవ్రంగా ఖండించారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసును ప్రస్తావిస్తూ.. 14 ఏళ్ల అమ్మాయిని మూడు రోజుల పాటు గదిలో బంధించి హింసించిన ఓ కుర్రోడి అదృశ్యంపై కేసు నడుస్తోందని, ఓ క్రిమినల్‌కు కులం అంటగట్టి కొందరు ఎలా వెనకేసుకొస్తారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  "నిందితుడి తల్లి బాధను నేను అర్థం చేసుకోగలను. అది వేరు. కానీ, ఒక ప్రొఫెషనల్ క్రిమినల్‌లా ప్రవర్తించిన వ్యక్తికి ఎలా మద్దతిస్తారు?" అని ఆయన ప్రశ్నించారు.

కేవలం తమ కులానికి చెందినవాడనే కారణంతో ఒక నేరస్థుడికి మద్దతు పలకడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఈ తరహా దిగజారుడు రాజకీయాలను జనసేన సహించబోదని స్పష్టం చేశారు.

వ్యవస్థను బ్రేక్ చేస్తాను కాబట్టే నాపై కోపం

"ఒక క్రిమినల్‌కు కులం ఎలా అంటగడతారు? ఏ ప్రాతిపదికన అతడిని వెనకేసుకొస్తారు? మీ కులం అయితే సరిపోతుందా? మీ నాయకుడు ఎవరో చెబితే, మీరేంటో నేను చెబుతాను. బూతులు తిట్టేవాళ్లను, క్రిమినల్స్‌ను నాయకులుగా నమ్మితే సమాజానికి ఏం సందేశం ఇచ్చినట్టు?" అని పవన్ ప్రశ్నించారు. వైసీపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను వాడుకుంటోందని, తనను విమర్శించడానికి కాపు సామాజికవర్గానికి చెందిన నేతలనే ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.

"నన్ను తిట్టేవాళ్లలో ఎక్కువమంది కాపులే. వాళ్ల భుజాలపై తుపాకీ పెట్టి నన్ను కాలుస్తున్నారు. లింగమనేని రమేశ్ గారికి రాజ్యసభ ఇస్తే వాళ్లే విమర్శిస్తారు. ఈ కుట్రపూరిత రాజకీయాలను బ్రేక్ చేస్తాను కాబట్టే నాపై కొందరికి అంత కోపం" అని పవన్ అన్నారు. తాను ఎప్పుడూ కులం కార్డు వాడి రాజకీయాలు చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోనని తేల్చిచెప్పారు. 

"దేశమే నాకు కులం. కులం అనేది ఒక సామాజిక వాస్తవం, దాన్ని గౌరవిస్తాను. కానీ అది ఇంటి గడప దాటకూడదు. గడప దాటితే మానవత్వం, దేశం మాత్రమే గుర్తుండాలి. నేను కులాల ఐక్యతను కోరుకుంటాను తప్ప, వాటిని రాజకీయ పెట్టుబడిగా మార్చను" అని ఆయన ఉద్ఘాటించారు.

బీసీలు ఐక్యంగా ఉంటే ఇచ్చే స్థాయికి ఎదుగుతారు

అధికారానికి దూరంగా ఉన్న సామాజిక వర్గాల సాధికారతపై పవన్ కల్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల గురించి మాట్లాడుతూ, వారు ఐక్యతతో వ్యవహరించాలని సూచించారు. "దాదాపు 50 శాతం జనాభా ఉన్న బీసీలు ఎవరినో పదవులు అడగాల్సిన అవసరం ఏముంది? మీలో మీకు ఐక్యత లేదు కాబట్టే ఆ పరిస్థితి. గొడవలప్పుడు ఏకమవుతారు, ఓట్ల విషయానికి వచ్చేసరికి విడిపోయి సంప్రదాయ పార్టీలకు ఓటేస్తున్నారు. మీరు ఐక్యంగా ఉంటే, మీరు పది మందికి పదవులు ఇచ్చే స్థితిలో ఉంటారు కానీ, ఇలా దేహీ దేహీ అనే స్థితిలో ఉండరు. బీసీలంతా ఏకమైతే, మీకు వైసీపీ లాంటి పార్టీ అవసరం ఉండదు, నాలాంటోడు కూడా అవసరం ఉండడు" అని పవన్ అన్నారు. 

నాయకుడు అనేవాడు కేవలం తన కులాన్ని కాదు, అన్ని కులాలను కలుపుకొని, అందరి నమ్మకాన్ని చూరగొన్నప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని హితవు పలికారు. కాన్షీరామ్ నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ, ఏ ఉద్యమమైనా ఒకే సామాజిక వర్గానికి పరిమితమైతే దాని ఎదుగుదలకు పరిమితులు ఏర్పడతాయని విశ్లేషించారు.

సంస్థాగత నిర్మాణమే లక్ష్యం

పార్టీ కోసం సంవత్సరాలుగా గుర్తింపు ఆశించకుండా పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలను గుర్తించి, భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దడానికే 'జనసేన పార్టీ సారథుల సమాచార సేకరణ కమిటీ'ని ఏర్పాటు చేశామని పవన్ తెలిపారు. గతంలో కొందరికి బాధ్యతలు అప్పగించినా, వారు క్షేత్రస్థాయిలోని శివ, మునీర్ హసన్ వంటి కార్యకర్తలను గుర్తించడంలో విఫలమయ్యారని అన్నారు. 

"పదేళ్లుగా గుర్తింపునకు నోచుకోకుండా పార్టీ కోసం పనిచేసిన సాధక్‌లకు, జనసైనికులకు ఇప్పుడు గుర్తింపు ఇచ్చే సమయం వచ్చింది. అందుకే 700 మంది సభ్యుల కమిటీలో 600 మంది సాధక్‌లకే అవకాశం కల్పించాం. మీరే క్షేత్రస్థాయిలో ఎవరు పనిచేస్తున్నారో, ఎవరు పనిచేయడం లేదో గుర్తించి సమాచారం అందించాలి. ఇది నాయకులను ఎంపిక చేసే కమిటీ కాదు, కేవలం పారదర్శకంగా సమాచారాన్ని సేకరించే కమిటీ మాత్రమే" అని పవన్ స్పష్టం చేశారు.

ఛాయిస్ ఈజ్ యువర్స్

గత వైసీపీ ప్రభుత్వంపై పవన్ విమర్శలు గుప్పించారు. కేవలం బటన్ నొక్కి డబ్బులు వేయడమే పాలన కాదని, మౌలిక సదుపాయాలను పూర్తిగా గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. "డబ్బులు వేశారు సరే, రోడ్లు ఎవరు వేయాలి? ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏంటి? ఒక రోడ్డు లేకపోతే ఊరి నుంచి ప్రజలు ఎలా బయటకు వస్తారు? ఎన్ని ఉచితాలు ఇచ్చినా, మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ప్రజలు ఇంకోసారి నమ్మరు అనడానికి వైఎస్‌ఆర్‌సీపీ ఓటమే క్లాసిక్ ఉదాహరణ" అని అన్నారు. తమ కూటమి ప్రభుత్వం సంక్షేమానికి వ్యతిరేకం కాదని, అయితే సంక్షేమంతో పాటు అభివృద్ధికి, వ్యవస్థల బలోపేతానికి పెద్దపీట వేస్తుందని హామీ ఇచ్చారు. 

చివరగా, వై‌సీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. "మీరు మమ్మల్ని తిట్టడం మానేస్తే, మేము మా పార్టీ నిర్మాణ పనుల్లో ఉంటాం. లేదు, తిడతామంటే.. మిమ్మల్ని తిడుతూనే మేము బలపడతాం. ఏదైనా సరే, మేము బలపడటం గ్యారెంటీ. ఛాయిస్ ఈజ్ యువర్స్" అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
Pawan Kalyan
Sai Krishna Missing Case
Janasena Party
YSRCP Leaders
Andhra Pradesh Politics
Caste Based Politics

More Telugu News