ఏపీ విద్యుత్ అధికారులకు మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు
- వంద రోజుల్లో 6 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేయాలన్న మంత్రి గొట్టిపాటి
- ఎస్సీ, ఎస్టీ వర్గాల లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
- ప్రతి డిస్కం పరిధిలో రోజుకు 2 వేల కనెక్షన్లు పూర్తి చేయాలని ఆదేశం
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి నిన్న విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి, నెడ్ క్యాప్ వీసీఎండీ కమలాకర్ బాబు, పీఎం సూర్యఘర్ పథకం కాంట్రాక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి డిస్కం పరిధిలో రోజుకు కనీసం 2 వేల సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేసేలా అధికారులు పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపు వల్లే ఈ పథకం రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతోందని మంత్రి ప్రశంసించారు. పనుల విషయంలో గుత్తేదారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా సహించేది లేదని, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆయన గట్టిగా హెచ్చరించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లక్ష్య సాధనకు కృషి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.