మోహన్ బాబుకు సుప్రీంకోర్టు షాక్
- 2019 ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు
- మోహన్‌బాబు స్టే పిటిషన్ సుప్రీంకోర్టులో తిరస్కరణ
- మే 2న విచారణ అధికారి ముందు హాజరు కావాలని ఆదేశం
రేపు సంబంధిత విచారణ అధికారి ఎదుట మోహన్‌బాబు కచ్చితంగా హాజరు కావాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసేందుకు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ధర్నా జరిగిన సమయంలో మోహన్‌బాబు వ్యక్తిగతంగా అక్కడ ఉన్నారా? అని ధర్మాసనం ఆయన తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.
మోహన్‌బాబు తరపున వాదనలు వినిపించిన న్యాయవాది, ఆయన 75 ఏళ్ల వయసున్న వారని, విద్యాసంస్థను నడుపుతున్నారని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తించదని వాదించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం తమ సంస్థ ఆధ్వర్యంలో చేసిన నిరసన కార్యక్రమం నిబంధనల ఉల్లంఘన పరిధిలోకి రాదని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఛార్జిషీట్లో తమపై కోడ్ ఉల్లంఘన అభియోగాలు మోపారని కోర్టు దృష్టికి తెచ్చారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ, విచారణ అధికారి ముందు హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.