Gali Janardhana Reddy: బంగారు నగలు తుప్పు పట్టిపోతాయన్న గాలి జనార్దన్ రెడ్డి... పిటిషన్ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

Telangana High Court dismissed Gali Janardhan Reddy petition

  • ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిపై విచారణ
  • గాలి ఇంటి నుంచి 53 కిలోల బంగారు నగలు స్వాధీనం 
  • కేసు విచారణ పూర్తయ్యాకే అవి ఎవరికి చెందుతాయన్నది నిర్ణయిస్తామన్న హైకోర్టు

ఓఎంసీ (ఓబుళాపురం మైనింగ్ కంపెనీ) కేసులో సీజ్ చేసిన 53 కిలోల బంగారు నగలు పాడైపోతున్నాయని, వాటిని తమకు అప్పగించాలని గాలి జనార్దనరెడ్డి చేసిన విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. నగదు, 5 కోట్ల రూపాయల విలువైన బాండ్లను కూడా విడుదల చేయాలని గాలి జనార్దనరెడ్డి, ఆయన కుమార్తె బ్రాహ్మణి, కుమారుడు కిరీటిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. 

నగలు తుప్పు పట్టి, విలువ తగ్గుతుందన్న గాలి వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఓఎంసీ కేసు విచారణ పూర్తయిన తర్వాతే వాటిపై హక్కులు ఎవరికి చెందుతాయన్నది నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. 

అక్రమ మైనింగ్ ద్వారా 884.13 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని సీబీఐ కేసు నమోదు చేసిందని, నేరపూరిత సొమ్ముతో కొన్న నగలపై ఈడీ కూడా హక్కులు కోరుతోందని కోర్టు పేర్కొంది. ఈ దశలో సీజ్ చేసిన వాటిని అప్పగించడానికి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. 

ఓఎంసీ కేసు విచారణ పూర్తయిన తర్వాత నగలను, సొమ్మును తిరిగి తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. కోర్టు తీర్పుతో గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం తీవ్ర నిరాశకు గురైంది. 

  • Loading...

More Telugu News