Firing: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై దుండగుల కాల్పులు .. వీడియో ఇదిగో

former congress mla bamber thakur shot bilaspur

  • కాల్పులు జరుపుతూ మాజీ ఎమ్మెల్యే ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 
  • మాజీ ఎమ్మెల్యేతో పాటు సెక్యూరిటీ అధికారికి గాయాలు
  • బిలాస్ పుర్ ఎయిమ్స్ లో బాధితులకు చికిత్స

హోలీ పండుగ రోజు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే‌పై దుండగులు కాల్పులు జరపడం కలకలాన్ని రేపింది. నలుగురు దుండగులు గన్స్‌తో ఇంట్లోకి చొరపడి 12 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పుర్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

వివరాల్లోకి వెళితే .. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో ఆయనతో పాటు సెక్యురిటీ అధికారి కూడా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన కాలికి బుల్లెట్ గాయం అయినట్లు సమాచారం. అయితే ఈ దాడి ఎవరు చేశారు? అనేది తెలియరాలేదు. దుండగుల కాల్పుల్లో గాయపడిన ఠాకూర్‌ను తొలుత సురక్షిత ప్రాంతానికి తరలించి, ఆయన పీఎస్ఓ ను నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. 

అనంతరం ఠాకూర్‌ను కూడా ఆసుపత్రిలో చేర్పించారు. బిలాస్‌పుర్ ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఇద్దరినీ బిలా‌స్‌పుర్ ఎయిమ్స్‌కు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నలుగురు దుండగులు ఆయుధాలతో అకస్మాత్తుగా కాల్పులు జరుపుతూ ఇంట్లోకి ప్రవేశించడం సీసీ టీవీ పుటేజీలో కనిపించింది. కాల్పుల అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర సంచలనం అయింది.    

More Telugu News