Pawan Kalyan: అలాగైతే తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి... హిందీ వద్దనుకుప్పుడు హిందీ రాష్ట్రాల నుంచి డబ్బులు ఎందుకు?: పవన్

- కేంద్రం, తమిళనాడు మధ్య హిందీ భాషా వివాదం
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
- భాషలను ద్వేషించే విధానం పోవాలని ఆకాంక్ష
- హిందువులు ముస్లింలను చూసి నేర్చుకోవాలని హితవు
కేంద్ర ప్రభుత్వం తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందంటూ తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతున్న వేళ జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారు అంటారు... అన్నీ దేశ భాషలే కదా! తమిళనాడులో హిందీ వద్దు, హిందీ వద్దు అంటుంటే నాకు మనసులో ఒకటే అనిపించింది. తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి... ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్ గఢ్ నుంచి డబ్బులు కావాలి... పనిచేసేవాళ్లందరూ బీహార్ నుంచి కావాలి... కానీ మేం హిందీని ద్వేఫిస్తాం అంటే ఇదెక్కడి న్యాయం? ఈ విధానం మారాలి.
భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. మీరు ముస్లింలను చూసి నేర్చుకోండని హిందువులందరికీ చెబుతుంటాను... ఆలయాల్లో సంస్కృతంలో మంత్రాలు చదవకూడదని అంటుంటారు... మరి ముస్లింలు అలా ఎప్పుడైనా అంటుంటారా? ముస్లింలు ఎక్కడి వారైనా కావొచ్చు... అరబిక్ లేదా ఉర్దూలో ప్రార్థిస్తారు. హిందూ ధర్మంలో సంస్కృతంలోనే మంత్రాలు ఉంటాయి... మరి అలాంటప్పుడు తమిళంలో మంత్రాలు చదవాలా, తెలుగులో మంత్రాలు చదవాలా?" అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.