Crime News: కాకినాడలో దారుణం.. పోటీ ప్రపంచంలో రాణించలేరని పిల్లలను చంపేసి ఉరేసుకున్న తండ్రి

Father hangs him self after killing childern in Kakinada
  • భార్య, పిల్లలతో కలిసి ఆఫీసులో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొన్న చంద్రకిశోర్
  • పిల్లలు సరిగా చదవడం లేదని మనస్తాపం
  • కాళ్లు, చేతులు కట్టేసి పిల్లల తలల్ని బకెట్లో ముంచి చంపేసిన వైనం
  • ఆపై ఫ్యాన్‌కు ఉరివేసుకున్న చంద్రకిశోర్
ఈ పోటీ ప్రపంచంలో తన పిల్లలు రాణించలేరని భావించిన ఓ తండ్రి వారిని చంపేసి తాను ఉరివేసుకున్నాడు. హోలీ పండుగ నాడు కాకినాడలోని సుబ్బారావునగర్‌లో జరిగిందీ దారుణం. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్ కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. భార్య తనూజ, ఒకటో తరగతి చదివే కుమారుడు జోషిల్ (7), యూకేజీ చదివే చిన్న కుమారుడు నిఖిల్ (6), భార్య తనూజతో కలిసి నగరంలోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్నాడు. పిల్లలు సరిగా చదవడం లేదని ఇటీవల వారు చదువుతున్న స్కూల్ మార్పించాడు.

చంద్రకిశోర్ నిన్న భార్య, పిల్లలతో కలిసి ఆఫీసులో నిర్వహించిన హోలీ వేడుకలకు హాజరయ్యాడు. ఆ తర్వాత పిల్లలకు యూనిఫాం కొలతలు తీయించేందుకు టైలర్ వద్దకు వెళ్తున్నానని, అక్కడే ఉండాలని, పది నిమిషాల్లో వస్తానని భార్యను నమ్మించి పిల్లలను తీసుకెళ్లాడు. ఎంతసేపటికీ భర్త రాకపోవడంతో అనుమానం వచ్చి తనూజ ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తకపోవడంతో తోటి ఉద్యోగులను తీసుకుని ఇంటికి వెళ్లింది. తలుపు వేసి ఉండటంతో కిటికీ లోంచి చూడగా భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లగా పిల్లలిద్దరూ కాళ్లు, చేతులకు కట్లతో నిండా నీళ్లు ఉన్న బకెట్లలో తలలు మునిగిపోయి కనిపించారు. ఆ దృశ్యాలు చూసిన తనూజ కుప్పకూలిపోయింది. 

ప్రస్తుత పోటీ ప్రపంచంలో తన పిల్లలు పోటీ పడలేకపోతున్నారని, వారికి భవిష్యత్తు లేదని, అందుకే పిల్లల్ని చంపి తాను కూడా చనిపోతున్నానని చంద్రశేఖర్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Crime News
Kakinada
Andhra Pradesh

More Telugu News