సల్మాన్ కుటుంబం మొండి పట్టుదల వదిలి మా వాళ్లకు క్షమాపణ చెప్పాలి: లారెన్స్ బిష్ణోయ్ బంధువు రమేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సల్మాన్ కుటుంబం మొండి పట్టుదల వదిలి మా వాళ్లకు క్షమాపణ చెప్పాలి: లారెన్స్ బిష్ణోయ్ బంధువు రమేశ్

Salman Khan family must leave stubbornness and apologize says Ramesh Bishnoi
  • టైగర్ ష్రాఫ్ కారుపై ముంబైలో కాల్పుల ఘటన
  • సల్మాన్‌తో పనిచేయొద్దని బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిక
  • సల్మాన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన లారెన్స్ బంధువు
  • కాల్పుల ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఇది వ్యక్తిగతం కాదు, మత విశ్వాసాల సమస్య అని స్పష్టీకరణ
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు మధ్య ఉన్న వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. సల్మాన్‌తో కలిసి పనిచేయొద్దంటూ నటుడు టైగర్ ష్రాఫ్‌కు వార్నింగ్ ఇస్తూ ఆయన కారుపై కాల్పులకు పాల్పడటం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తమ బిష్ణోయ్ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ప్రమాదకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని లారెన్స్ బంధువు రమేశ్ బిష్ణోయ్ సోమవారం హెచ్చరించారు.

టైగర్ ష్రాఫ్‌పై దాడి.. ముగ్గురి అరెస్ట్

ముంబైలోని జుహూ ప్రాంతంలో ఆదివారం ఫుట్‌బాల్ ప్రాక్టీస్ ముగించుకుని ఇంటికి వెళుతున్న టైగర్ ష్రాఫ్ కారుపై ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో టైగర్ స్వల్ప గాయాలతో బయటపడగా, ఆయన డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. వెంటనే డ్రైవర్ ను నానావతి ఆసుపత్రికి తరలించారు. ఈ దాడితో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.

ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే, ఈ దాడికి తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన అనిల్ పండిట్ పేరుతో సోషల్ మీడియాలో ఒక పోస్టు ప్రత్యక్షమైంది. సల్మాన్‌తో పనిచేయడం ఆపకపోతే ఇలాంటి పరిణామాలు తప్పవని అందులో టైగర్‌ను హెచ్చరించారు. ఈ కేసులో వేగంగా స్పందించిన రాజస్థాన్ పోలీసులు.. నిందితులు పుణే-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారని సమాచారం అందుకుని, కోటా రైల్వే స్టేషన్‌లో రైలును చుట్టుముట్టి ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితులను హర్యానాకు చెందిన రెహాన్, బీహార్‌కు చెందిన హృతిక్ కుర్మి, మరో మైనర్‌గా గుర్తించారు.

క్షమాపణ ఒక్కటే పరిష్కారం: రమేశ్ బిష్ణోయ్

ఈ ఘటనపై ఐఏఎన్ఎస్‌తో మాట్లాడుతూ రమేశ్ బిష్ణోయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "సల్మాన్‌తో పనిచేసే ఎవరికైనా ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది లారెన్స్ గ్యాంగ్ ఉద్దేశం ఈ విషయంలో సల్మాన్ కుటుంబం మొండిపట్టుదల వీడాలి. ఇది కేవలం లారెన్స్ వ్యక్తిగత వివాదం కాదు, మొత్తం బిష్ణోయ్ సమాజానికి సంబంధించిన సమస్య. మా మత విశ్వాసాలను సల్మాన్ గాయపరిచారు. అందుకే సమాజంలో తీవ్ర ఆగ్రహం ఉంది. దానికి లారెన్స్ ప్రతినిధిగా నిలుస్తున్నాడు. సల్మాన్ ముందుకు వచ్చి క్షమాపణ చెబితే సమస్య పరిష్కారమవుతుంది, కానీ ఆయన అందుకు సిద్ధంగా లేరు" అని రమేశ్ స్పష్టం చేశారు.

1998లో 'హమ్ సాత్ సాత్ హై' సినిమా షూటింగ్ సమయంలో రాజస్థాన్‌లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ నిందితుడిగా ఉన్నారు. బిష్ణోయ్ సమాజం కృష్ణ జింకలను పవిత్రంగా పూజిస్తుంది. ఈ కేసులో 2018లో ట్రయల్ కోర్టు సల్మాన్‌ను దోషిగా తేల్చగా, ఆయన పైకోర్టులో అప్పీల్ చేశారు. ఆ కేసు అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది.


Advertisement
Salman Khan
Lawrence Bishnoi
Tiger Shroff
Ramesh Bishnoi
Blackbuck poaching case
Mumbai Police

More Telugu News