ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం కుప్పకూలిపోయింది.. కత్తులు, కర్రలతో మా వాళ్లను వెంటాడుతున్నారు: జగన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం కుప్పకూలిపోయింది.. కత్తులు, కర్రలతో మా వాళ్లను వెంటాడుతున్నారు: జగన్

Jagan Mohan Reddy demands President Rule in Andhra Pradesh
  • రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్
  • నామినేషన్ల ప్రక్రియలో టీడీపీ గూండాయిజం చేస్తోందని ఆరోపణ
  • పోలీసుల సమక్షంలోనే ఎంపీలపై దాడులు జరిగాయని వెల్లడి
  • చంద్రబాబు పాలనలో జంగిల్‌రాజ్ నడుస్తోందని విమర్శ
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం పూర్తిగా కుప్పకూలిపోయిందని, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికార తెలుగుదేశం పార్టీ హింసకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలకు గూండా లైసెన్స్‌లు ఇచ్చి, వారికి అండగా పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని జగన్ ఆరోపించారు. "రాజకీయ హింసావాదిగా తన చరిత్రను మరోసారి చాటుకుంటూ రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను నడిపిస్తున్నారు. ప్రతిపక్ష అభ్యర్థులు కనీసం నామినేషన్లు కూడా వేయలేని దుస్థితి సృష్టించారు" అని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. వైసీపీ అభ్యర్థులను పోలీసుల సమక్షంలోనే కత్తులు, కర్రలతో వెంటాడుతున్నారని, నామినేషన్ పత్రాలను లాక్కుని చించివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ అభ్యర్థులను పోలీసులు అక్రమంగా ఎత్తుకెళుతున్నారని, ఇదే చంద్రబాబు మార్కు ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు.

ఈ దాడుల్లో తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు కూడా బాధితులయ్యారని జగన్ తెలిపారు. అభ్యర్థులకు ప్రపోజర్లుగా వెళ్లిన ఎంపీలపై పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయని, వారి చేతుల్లోంచి నామినేషన్ పత్రాలు లాక్కుని చించేశారని వివరించారు. "ఎంపీలకే రక్షణ లేని రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి?" అని నిలదీశారు. కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, రాయచోటి, పుంగనూరు, తిరుపతి, దర్శి, గురజాల సహా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఇవి చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఎంతగా దిగజారిపోయిందో చూపుతున్నాయని అన్నారు.

పులివెందులలో పోలీసులు జరిపిన కాల్పులు ప్రజాస్వామ్యంపై పేల్చిన తూటాలని, దీని వెనుక చంద్రబాబు కుట్ర ఉందని జగన్ ఆరోపించారు. నామినేషన్ వేయడానికి వచ్చిన వారిపై పోలీసులు ఎందుకు దాడి చేశారని, ఎందుకు కాల్పులు జరిపారని ప్రశ్నించారు. "నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం ఎన్నికలా? ప్రతిపక్ష అభ్యర్థులను పోలీసులతో ఎత్తుకెళ్లడం ప్రజాస్వామ్యమా? ఎంపీలపైనే దాడులు చేయించడం రాజ్యాంగ పాలనా?" అని చంద్రబాబును ఉద్దేశించి జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. 

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ఈ పరిస్థితుల్లో కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. "సూపర్ 6, సూపర్ 7ల మోసాలతో ప్రజలకు బాండ్లు ఇచ్చి మరీ మోసం చేసిన ఈ వెన్నుపోటు పార్టీ నుంచి ఇంతకన్నా ఏమి ఆశించగలం!" అని జగన్ తన పోస్టును ముగించారు.
Advertisement
Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
Chandrababu Naidu
YSRCP TDP Clashes
President Rule AP
Local Body Elections Violence

More Telugu News