పొత్తు ధర్మంపై టీడీపీలో అసంతృప్తి... మంత్రి సంధ్యారాణి తీవ్ర ఆవేదన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పొత్తు ధర్మంపై టీడీపీలో అసంతృప్తి... మంత్రి సంధ్యారాణి తీవ్ర ఆవేదన

Gummadi Sandhyarani expresses deep distress over TDP Janasena alliance dharma
  • సాలూరు మున్సిపల్ చైర్మన్ పదవి జనసేనకు కేటాయింపు
  • తీవ్ర ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి సంధ్యారాణి
  • అధిష్ఠానం నిర్ణయాన్ని పునరాలోచించాలని అచ్చెన్నాయుడికి విజ్ఞప్తి
  • పొత్తుల్లో త్యాగాలు తప్పవని సర్దిచెప్పిన అచ్చెన్నాయుడు
పొత్తులో భాగంగా సాలూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవిని జనసేన పార్టీకి కేటాయించడంపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల తనకు అన్యాయం జరిగిందని ఆమె కన్నీటి పర్యంతమవడం తెలుగుదేశం పార్టీ శ్రేణులలో కలకలం రేపింది. శుక్రవారం సాలూరులో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

పార్వతీపురం మన్యం జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలోనే సంధ్యారాణి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురవుతూ.. సుదీర్ఘ విరామం తర్వాత 2024 ఎన్నికల్లో సాలూరులో టీడీపీకి ప్రజలు ఘన విజయాన్ని అందించారని గుర్తుచేశారు. అటువంటి నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ పదవిని మిత్రపక్షానికి కేటాయించడం వల్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని పేర్కొన్నారు.

జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో ఇప్పటికే రెండింటిని జనసేనకు కేటాయించిన నేపథ్యంలో, వెనుకబడిన ప్రాంతమైన సాలూరును కనీసం టీడీపీకే కేటాయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎస్టీ అభ్యర్థిగా తన విజయం కోసం పార్టీ కార్యకర్తలు, బీసీ సామాజిక వర్గాలు అహర్నిశలు శ్రమించాయని, ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల వారికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం తన నిర్ణయాన్ని పునరాలోచించేలా చొరవ తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడిని ఆమె కోరారు.

ఈ క్రమంలో స్థానిక నాయకులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన మంత్రి అచ్చెన్నాయుడు.. పొత్తు ధర్మంలో భాగంగా కొన్ని త్యాగాలు తప్పవని, అందరికీ పదవుల కేటాయింపు సాధ్యపడదని స్పష్టం చేశారు. అధిష్ఠానం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని చెబుతూనే, తమ విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించాలని సంధ్యారాణి మరోసారి కోరారు.
Advertisement
Gummadi Sandhyarani
TDP Janasena Alliance
Saluru Municipality Chairman
Atchannaidu
Andhra Pradesh Politics
Salur TDP News

More Telugu News