అఖిలేశ్‌ రెడీనా? అయోధ్య నుంచి పోటీకి యోగి బహిరంగ సవాల్‌!
Add ap7am to your home Screen

అఖిలేశ్‌ రెడీనా? అయోధ్య నుంచి పోటీకి యోగి బహిరంగ సవాల్‌!

Yogi Adityanath Open Challenge to Akhilesh Yadav to Contest from Ayodhya
  • అయోధ్య నుంచి పోటీకి సిద్ధమన్న యోగి
  • అఖిలేశ్‌తో నేరుగా పోటీకి సవాల్‌
  • సమాజ్‌వాదీ పార్టీపై యోగి తీవ్ర విమర్శలు
  • రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అభ్యంతరం
  • ఎన్డీయేకు 80 శాతం సీట్లు వస్తాయని ధీమా
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అయోధ్య నుంచి పోటీ చేయాలన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్వీకరించారు. అయితే ఒక షరతు విధించారు. అఖిలేశ్‌ కూడా అయోధ్య నుంచి బరిలోకి దిగాలని ప్రతి సవాల్‌ విసిరారు. ఇద్దరి మధ్య నేరుగా పోటీ జరగాలని అన్నారు. శనివారం బలరాంపూర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న యోగి ఈ వ్యాఖ్యలు చేశారు.

అఖిలేశ్‌ యాదవ్‌పై యోగి తీవ్ర విమర్శలు చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి కుటుంబం గురించి తప్ప మరో ఆలోచన లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపిందని చెప్పారు. వారిలో అఖిలేశ్‌ బాబాయి రామ్‌ గోపాల్‌ యాదవ్‌ ఒకరని, మరో సీటును పారిశ్రామికవేత్త ధన్‌రాజ్‌ పరిమల్‌ నత్వానీకి కేటాయించారని విమర్శించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, బ్రాహ్మణులు సహా ఇతర వర్గాలకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు.

సమాజ్‌వాదీ పార్టీ చెప్పే ‘పీడీఏ’కు కుటుంబ అభివృద్ధి సంస్థ, రాష్ట్రాన్ని ముంచే కూటమి అని కొత్త అర్థాలు చెబుతూ యోగి విమర్శలు గుప్పించారు. గతంలో సమాజ్‌వాదీ పార్టీ పాలనలో యువతకు ఉద్యోగాలు రాలేదని, రైతులు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు.

అయోధ్యలో గతంలో రోజుకు మూడు, నాలుగు గంటలే విద్యుత్‌ సరఫరా ఉండేదని, పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉండేవని యోగి అన్నారు. ఇప్పుడు ఆ నగరం రామరాజ్యానికి ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం సీట్లు ఎన్డీయే గెలుస్తుందని యోగి ధీమా వ్యక్తం చేశారు. మిగిలిన సీట్లు ఇతర పార్టీలకు వెళ్లినా బలరాంపూర్‌ అభివృద్ధి ఆగదని చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌పై జరుగుతున్న నిరసనలను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు హద్దులు దాటి వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
Advertisement
Yogi Adityanath
Akhilesh Yadav
Ayodhya
Samajwadi Party
Uttar Pradesh Assembly Elections
PDA Alliance

More Telugu News