‘మళ్లీ భారత్‌కు ఆడకపోయినా నాకేం నష్టం లేదు’.. షమీ సంచలన వ్యాఖ్యలు!
Add ap7am to your home Screen

‘మళ్లీ భారత్‌కు ఆడకపోయినా నాకేం నష్టం లేదు’.. షమీ సంచలన వ్యాఖ్యలు!

Mohammed Shami says no loss even if I do not play for India again
  • టీమిండియాలో చోటుపై షమీ కీలక వ్యాఖ్యలు
  • భువనేశ్వర్‌ ఎంపికపై తనకు అభ్యంతరం లేదని వెల్లడి
  • ప్రస్తుతం రంజీ ట్రోఫీపైనే దృష్టి పెట్టానని వెల్లడి
  • బెంగాల్‌ తరఫున ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నానని వ్యాఖ్య
  • అయినా రెండుమూడేళ్లుగా జాతీయ జట్టులో అవకాశం రావడం లేదని వ్యాఖ్య
టీమిండియాలో చోటు దక్కకపోవడంపై సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు మళ్లీ ఆడే అవకాశం రాకపోతే అది తనకు నష్టం కాదని స్పష్టం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి పెట్టినట్లు తెలిపాడు.

న్యూజిలాండ్‌ పర్యటనకు భారత టీ20 జట్టును ప్రకటించిన సెలెక్టర్లు.. నాలుగేళ్ల తర్వాత భువనేశ్వర్‌ కుమార్‌కు అవకాశం ఇచ్చారు. అయితే షమీకి మాత్రం చోటు దక్కలేదు. 2023 వన్డే ప్రపంచకప్‌, 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీలో కీలక పాత్ర పోషించిన షమీ.. చివరిసారిగా 2025 మార్చిలో భారత్‌ తరఫున ఆడాడు. గాయాల నుంచి కోలుకుని దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్నా జాతీయ జట్టులోకి ఎంపిక కావడం లేదు.

భువనేశ్వర్‌కు అవకాశం రావడంపై స్పందించిన షమీ.. అతడికి మంచి అవకాశం దక్కిందని చెప్పాడు. అయితే అతడి ఎంపికతో తనకు సంబంధం లేదన్నాడు. ఎక్కడ ఆడే అవకాశం వచ్చినా తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానని తెలిపాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ మ్యాచ్‌పైనే తన దృష్టి ఉందని చెప్పాడు. గత రెండుమూడేళ్లుగా బాగా ఆడుతున్నా.. బెంగాల్‌ తరఫున తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నా.. భారత జట్టులో చోటు దక్కడం లేదని పేర్కొన్నాడు.

మరోవైపు, భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ షమీకి మద్దతుగా నిలిచాడు. అతడిని టెస్టు, వన్డే జట్లలోకి తీసుకోవాలని సూచించాడు. ప్రపంచకప్‌ సమీపిస్తున్న వేళ షమీ లాంటి నాణ్యమైన బౌలర్‌ను పక్కనపెట్టడం సరికాదన్నాడు. బుమ్రా, షమీ, సిరాజ్‌ తన తొలి ఎంపికలని చెప్పాడు. టెస్టు జట్టులో షమీ పునరాగమనాన్ని చాలాకాలంగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. మరోసారి అతడికి అవకాశం దక్కకపోతే భారత జట్టులోకి తిరిగొచ్చే మార్గం మూసుకుపోవచ్చని అభిప్రాయపడ్డాడు.
Advertisement
Mohammed Shami
Team India selection
Bhuvneshwar Kumar return
Ranji Trophy Bengal
Wasim Jaffer cricket
Indian cricket news

More Telugu News