క్యూ-శివ, అమరావతి డిక్లరేషన్.. పాన్ ఐఐటీ సమ్మిట్ లో కీలక ఘట్టాలను ఆవిష్కరించిన చంద్రబాబు
Advertisement

క్యూ-శివ, అమరావతి డిక్లరేషన్.. పాన్ ఐఐటీ సమ్మిట్ లో కీలక ఘట్టాలను ఆవిష్కరించిన చంద్రబాబు

Chandrababu Naidu unveils Q-Shiva and Amaravati Declaration at Pan IIT Summit
  • విజయవాడలో పాన్ ఐఐటీ సమ్మిట్-2026
  • హాజరైన సీఎం చంద్రబాబు
  • డీప్‌టెక్ స్టార్టప్‌ల కోసం రూ.500 కోట్ల వెంచర్ ఫండ్ ఏర్పాటు
  • అమరావతిలో శాశ్వత పాన్ ఐఐటీ కౌన్సిల్ ఏర్పాటుకు నిర్ణయం
  • వచ్చే ఫిబ్రవరి నుంచి అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్
  • క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సాంకేతిక ప్రగతికి, పెట్టుబడులకు కేంద్రంగా నిలవనుందనడానికి విజయవాడలో జరిగిన పాన్ ఐఐటీ అమరావతి సమ్మిట్ 2026 నిలువుటద్దం పట్టింది. ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి. డీప్‌టెక్నాలజీ అభివృద్ధికి ఊతమిచ్చేలా రూ.500 కోట్ల వెంచర్ ఫండ్ ఏర్పాటు చేస్తూ చారిత్రక 'అమరావతి డిక్లరేషన్' విడుదల చేయడంతో పాటు, "మేకిన్ అమరావతి" సంకల్పంతో రూపొందించిన ఐదు "క్యూ-శివ" క్వాంటం కంప్యూటర్లను సీఎం ఆవిష్కరించారు.

క్యూబిట్ ఫోర్స్ సంస్థ, చండీఘడ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్యూ-శివ కంప్యూటర్లు మినీ టెస్టింగ్ క్వాంటం ల్యాబ్‌లుగా పనిచేస్తాయి. వీటితో పాటు 4 కెల్విన్ ప్రాసెసర్ 'సృష్టి'ని కూడా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్యూబిట్ సంస్థ సీఈఓ వెంకటసుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఈ కంప్యూటర్ల తయారీకి అవసరమైన కొన్ని కీలక కాంపోనెంట్లు ప్రపంచంలో ఒకటి రెండు చోట్ల మాత్రమే లభిస్తాయని, అలాంటివి మన మచిలీపట్నంలో దొరకడం విశేషమని తెలిపారు. తమ ప్రయత్నానికి సీఎం చంద్రబాబు అందించిన సహకారం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. అనంతరం క్యూబిట్ ప్రతినిధుల కృషిని అభినందించిన ముఖ్యమంత్రి, వారితో కలిసి సెల్ఫీ దిగి ఉత్సాహపరిచారు.

అమరావతి డిక్లరేషన్.. డీప్‌టెక్‌కు ఊతం

ఈ సదస్సులో ఏపీ ప్రభుత్వం, పాన్ ఐఐటీ అలుమ్ని ప్రతినిధులు సంతకాలు చేసిన 'అమరావతి డిక్లరేషన్' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని ప్రకారం, అమరావతిలో ఏపీ ప్రభుత్వం-పాన్ ఐఐటీ అలుమ్ని ఇండియా ఆధ్వర్యంలో ఒక శాశ్వత కౌన్సిల్ ఏర్పాటు కానుంది. డీప్‌టెక్ స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రూ.500 కోట్ల పాన్ ఐఐటీ అమరావతి వెంచర్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ కౌన్సిల్ ద్వారా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, స్టార్టప్‌లను సమన్వయం చేస్తారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో 10 ఇండస్ట్రీ చైర్స్ ఏర్పాటు చేయడం, 100 మంది గ్లోబల్ ఐఐటీ మెంటర్లతో స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేయడం, 23 ఐఐటీల నుంచి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ వంటివి ఈ డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలు. క్వాంటమ్-ఏఐ, సెమీకండక్టర్లు, స్పేస్-డిఫెన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించి, 2030 నాటికి కనీసం 50 స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు.

క్వాంటం వ్యాలీగా అమరావతి: సీఎం చంద్రబాబు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. "గతంలో ఐటీని ప్రోత్సహిస్తే ప్రపంచవ్యాప్తంగా మన తెలుగువారు నిపుణులుగా ఎదిగారు. ఇప్పుడిక సిలికాన్ వ్యాలీ గురించి కాదు, అమరావతిలోని క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచం చర్చించుకుంటుంది" అని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను విజన్ 2020 తీసుకువచ్చినప్పుడు కొందరు '420' అంటూ హేళన చేశారని, కానీ దాని ద్వారానే విద్యుత్, రహదారుల వంటి రంగాల్లో సంస్కరణలు వచ్చాయని గుర్తుచేశారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని, 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదగడాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. జాతి నిర్మాణంలో భాగమైన ఐఐటీయన్లు వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఐబీఎం-టీసీఎస్, ఎల్ అండ్ టీ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న క్వాంటం కంప్యూటర్ ఆపరేషన్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమరావతి నుంచే ప్రారంభమవుతాయని చంద్రబాబు ప్రకటించారు. భవిష్యత్తులో కేవలం వినియోగించుకోవడమే కాకుండా, క్వాంటం కంప్యూటర్లను తయారు చేసి ఎగుమతి చేసే స్థాయికి ఆంధ్రప్రదేశ్ చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
Chandrababu Naidu
Pan IIT Amaravati Summit
Amaravati Declaration
Q Shiva Quantum Computer
DeepTech Venture Fund
Quantum Valley Andhra Pradesh

More Telugu News