ఏఐ దూకుడుకు కళ్లెం.. ఎన్విడియా కొత్త టూల్ ఆవిష్కరణ

ఏఐ దూకుడుకు కళ్లెం.. ఎన్విడియా కొత్త టూల్ ఆవిష్కరణ

NVIDIA launches new tool to curb AI aggression and ensure safety
  • ఏఐ ఏజెంట్లు అదుపు తప్పకుండా చూసేందుకు ఎన్విడియా కొత్త టూల్
  • ‘ఓపెన్ ఏజెంట్ సేఫ్టీ ప్లాట్‌ఫామ్’ను ఆవిష్కరించిన చిప్ మేకర్
  • ఏఐ భద్రతపై ఇతర సీఈఓలతో విభేదించిన జెన్సన్ హువాంగ్
  • రికార్డు స్థాయిలో 150 బిలియన్ డాలర్ల షేర్ బైబ్యాక్ ప్రకటించిన ఎన్విడియా
  • కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద షేర్ బైబ్యాక్‌గా నమోదు
టెక్నాలజీ దిగ్గజం, చిప్‌మేకర్ ఎన్విడియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భద్రత విషయంలో కీలక ముందడుగు వేసింది. ఏఐ ఏజెంట్లు అదుపు తప్పి ప్రవర్తించకుండా నిరోధించేందుకు ఒక కొత్త సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. 'ఎన్విడియా ఓపెన్ ఏజెంట్ సేఫ్టీ ప్లాట్‌ఫామ్' పేరుతో తీసుకొచ్చిన ఈ టూల్‌ను 100కు పైగా పరిశ్రమ భాగస్వాములతో కలిసి అభివృద్ధి చేసినట్లు కంపెనీ ప్రకటించింది.

ఈ ప్లాట్‌ఫామ్ ఏఐ ఏజెంట్లు చేసే ప్రతి పనిని పర్యవేక్షిస్తుంది. కంపెనీ నిబంధనలను అతిక్రమించకుండా చూస్తుంది. ఈ సందర్భంగా ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ మాట్లాడుతూ, "ఏఐ భద్రత సమస్యను పరిష్కరించినప్పుడే సమాజానికి దాని అసాధారణ సామర్థ్యం పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ఏఐ సామర్థ్యాల సరిహద్దులను మనం కనుగొంటున్న కొద్దీ, ఏఐ భద్రత విషయంలోనూ ఆవిష్కరణలను వేగవంతం చేయాలి" అని పేర్కొన్నారు.

భద్రతపై భిన్న స్వరాలు 
ఇటీవల కొన్ని ఏఐ వ్యవస్థలు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు లేకుండానే కార్పొరేట్, ప్రభుత్వ వ్యవస్థల్లోకి చొరబడినట్లు వార్తలు వచ్చాయి. ఓపెన్ఏఐ ఏజెంట్లు అమెరికా ప్రభుత్వ సైట్లను లక్ష్యంగా చేసుకున్నాయనే నివేదికలు ఆందోళన రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ వంటి వారు ఏఐపై కఠినమైన నియంత్రణలు ఉండాలని పిలుపునిచ్చారు.

అయితే, జెన్సన్ హువాంగ్ మాత్రం ఈ వాదనతో విభేదిస్తున్నారు. ఏఐ వల్ల మానవాళికి పెను ముప్పు ఉందన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. నిబంధనలు పరిశ్రమ వృద్ధికి ఆటంకం కలిగించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. "తమ కంపెనీ అదుపు తప్పుతోందని వారు భావిస్తే, ముందు ఆ కంపెనీని అదుపులోకి తెచ్చుకోవాలి" అంటూ సీఎన్ఎన్‌తో మాట్లాడుతూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

రికార్డు స్థాయిలో షేర్ బైబ్యాక్ 
ఇదే సమయంలో, ఎన్విడియా మరో సంచలన ప్రకటన చేసింది. కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద షేర్ బైబ్యాక్‌కు తెరలేపింది. ఏకంగా 150 బిలియన్ల  డాలర్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఉన్న 85 బిలియన్ డాలర్ల ప్రోగ్రామ్‌కు ఇది అదనం. గతంలో ఆపిల్ ప్రకటించిన 110 బిలియన్ డాలర్ల బైబ్యాక్ రికార్డును ఎన్విడియా అధిగమించింది. కంపెనీ వద్ద భారీగా నగదు నిల్వలు ఉండటం, దీర్ఘకాలిక అవకాశాలపై ఉన్న బలమైన విశ్వాసానికి ఇది నిదర్శనమని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 5.4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, ఈ భారీ ప్రకటనల తర్వాత కూడా ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు స్వల్పంగానే పెరిగాయి.
Advertisement
NVIDIA
Jensen Huang
AI Safety Platform
Share Buyback
AI Regulation
Artificial Intelligence

More Telugu News