బోయింగ్ విమానాల్లో సాఫ్ట్ వేర్ లోపాలు.. భారత్‌లో 96 విమానాలపై ఎఫెక్ట్

బోయింగ్ విమానాల్లో సాఫ్ట్ వేర్ లోపాలు.. భారత్‌లో 96 విమానాలపై ఎఫెక్ట్

Boeing 737 Max software glitches impact 96 aircraft in India
  • బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో కొత్త సాఫ్ట్‌వేర్ లోపం గుర్తింపు
  • భారత్‌లో ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 96 విమానాలపై ప్రభావం
  • ల్యాండింగ్ సమయంలో ఆటోమేటెడ్ గైడెన్స్ సిస్టమ్ ఆగిపోయే అవకాశం
  • భద్రతకు ముప్పులేదని, శాశ్వత పరిష్కారంపై పనిచేస్తున్నామని తెలిపిన బోయింగ్
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ తమ 737 మ్యాక్స్ విమానాల్లో మరో సాఫ్ట్‌వేర్ లోపాన్ని గుర్తించింది. దీని ప్రభావం భారత్‌లో ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు నడుపుతున్న సుమారు 96 విమానాలపై పడనుంది. ల్యాండింగ్ సమయంలో ఒకసారి విఫలమై, రెండోసారి వేరే మార్గంలో ప్రయత్నించే క్రమంలో (మిస్డ్ ల్యాండింగ్ అప్రోచ్) ఆటోమేటెడ్ ఫ్లైట్ గైడెన్స్ సిస్టమ్ పనిచేయడం ఆగిపోయే అవకాశం ఉందని బోయింగ్ వెల్లడించింది.

పీటీఐ తన కథనంలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఈ సమస్యపై బోయింగ్ గత నెలలోనే అన్ని 737 ఆపరేటర్లను అప్రమత్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పైలట్లు ఆటోమేషన్ తగ్గిపోవడాన్ని గమనించవచ్చని, దీన్ని సురక్షితంగా ఎలా ఎదుర్కోవాలో ఇప్పటికే ఉన్న విధానాలను బలోపేతం చేస్తూ మార్గదర్శకాలను పంచుకున్నట్లు తెలిపింది. తాత్కాలిక నివారణ చర్యగా, 'మిస్డ్ అప్రోచ్' తర్వాత సిస్టమ్‌ను రీసెట్ చేయాలని ఆపరేటర్లకు సూచించింది. శాశ్వత పరిష్కారం కోసం తమ ఇంజనీర్లు ఒక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అభివృద్ధి చేస్తున్నారని బోయింగ్ ప్రతినిధి ఒకరు ధృవీకరించారు.

భారత్‌లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వద్ద సుమారు 53, ఆకాశ ఎయిర్ వద్ద 43 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు ఉన్నాయి. ఈ సమస్యపై ఆకాశ ఎయిర్ స్పందిస్తూ.. తమ విమానాల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని, నిర్దేశిత విధానాలు, నియంత్రణ సంస్థల నిబంధనల ప్రకారమే సర్వీసులు కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ 2,400కు పైగా 737 మ్యాక్స్ విమానాలను డెలివరీ చేసింది. మరోవైపు, ఎయిర్‌బస్ సంస్థకు చెందిన కొన్ని ఏ321నియో విమానాల ఫ్యూసిలేజ్‌పై సర్ఫేస్ ప్రొటెక్షన్ కోటింగ్‌కు సంబంధించి నాణ్యతా లోపాన్ని గుర్తించినట్లు కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. భారత్‌లో ఇండిగో సంస్థ నడుపుతున్న సుమారు డజను విమానాల్లో ఈ సమస్య ఉన్నట్టు తెలుస్తోంది.
Advertisement
Boeing
Boeing 737 Max
Akasa Air
Air India Express
Aviation Software Glitch
India Aviation News

More Telugu News