ఆ రెండు పార్టీలతో నష్టమే.. ఈ నెల 30న ఆధారాలతో వస్తా: విజయసాయిరెడ్డి

ఆ రెండు పార్టీలతో నష్టమే.. ఈ నెల 30న ఆధారాలతో వస్తా: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy says loss with two parties and will reveal evidence on November 30
  • ఈ నెల 30న విశాఖలో విజయసాయి రెడ్డి కీలక ప్రెస్‌మీట్
  • రెండు కుటుంబ పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టమంటూ ఆరోపణ
  • ఆధారాలతో సహా వివరాలు బయటపెడతానని ప్రకటన
  • ఉత్తరాంధ్ర సమస్యలు, మత మార్పిడులపైనా మాట్లాడనున్నట్లు వెల్లడి
  • ప్రజల ముందు మరో 5 కొత్త ప్రతిపాదనలు ఉంచనున్న విజయసాయి
రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి మరో కీలక ప్రెస్‌మీట్‌కు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని రెండు కుటుంబ రాజకీయ పార్టీల వల్ల ప్రయోజనం లేకపోగా, తీవ్ర నష్టం జరుగుతోందని, ఇందుకు సంబంధించిన ఆధారాలను బయటపెడతానని ఆయన ప్రకటించారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు, విశాఖపట్నంలోని దసపల్లా హోటల్‌ వేదికగా ఈ వివరాలను వెల్లడిస్తానని తెలిపారు.

ఈ మీడియా సమావేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నట్లు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయం, ప్రస్తుత రాజకీయాల్లోని తెరవెనుక పొత్తులు, గిరిజనులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మత మార్పిడుల వంటి విషయాలపై మాట్లాడతానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆయన ఆహ్వానించారు.

ఇప్పటికే విజయవాడ, అనంతపురంలో నిర్వహించిన ప్రెస్‌మీట్ల ద్వారా 10 ప్రతిపాదనలను ప్రజల ముందు ఉంచినట్లు ఆయన గుర్తుచేశారు. తాజాగా విశాఖ సమావేశంలో మరో 5 కొత్త ప్రతిపాదనలను ముందుకు తేనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విజయసాయి రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ప్రకటన విడుదల చేశారు.
Advertisement
Vijayasai Reddy
Andhra Pradesh Politics
Visakhapatnam Press Meet
North Andhra Issues
Political Alliances
Religious Conversions

More Telugu News