భజనలకు కొత్త స్టైల్‌.. ‘భజన్ క్లబ్బింగ్‌’ అంటే ఏంటి? మోదీ ఎందుకు పాల్గొన్నారు?

భజనలకు కొత్త స్టైల్‌.. ‘భజన్ క్లబ్బింగ్‌’ అంటే ఏంటి? మోదీ ఎందుకు పాల్గొన్నారు?

What is Bhajan Clubbing and why did Narendra Modi participate in this new style of Bhajans
  • భజనలకు ఆధునిక కచేరీ తరహా రూపమే ‘భజన్ క్లబ్బింగ్‌’
  • లైవ్‌ మ్యూజిక్‌, బీట్‌లు, చప్పట్లతో కార్యక్రమం
  • ప్రేక్షకులు కూడా భజనల్లో భాగస్వాములయ్యే ఛాన్స్‌
  • యువతలో కొత్త ఆసక్తిని పెంచుతున్న ఈ విధానం
  • ఆధ్యాత్మికత, ఆధునిక సంగీతాన్ని కలిపే ప్రయత్నం
సాధారణంగా భజన అంటే ఓ చోట చేరి భక్తి పాటలు పాడటం.. తాళాలు వేయడం.. భక్తిలో మునిగిపోవడం. కానీ ఇప్పుడు ఇదే భజనలకు కాస్త కొత్త రూపం వచ్చింది. పాటలు అవే.. భక్తి భావం అదే.. అయితే ప్రదర్శించే విధానం మాత్రం కాస్త మోడ్రన్‌గా మారింది. ‘భజన్ క్లబ్బింగ్‌’ పేరుతో యువతను ఆకట్టుకుంటున్న ఈ ట్రెండ్‌ ఇప్పుడు మరోసారి చర్చలోకి వచ్చింది. కారణం.. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అంతటివాడు పాల్గొనడమే.

అసలు ‘భజన్ క్లబ్బింగ్‌’ అంటే?
‘భజన్ క్లబ్బింగ్‌’లో సంప్రదాయ భజనలను కచేరీ తరహాలో ప్రదర్శిస్తారు. భక్తి పాటలకు ఆధునిక సంగీత వాయిద్యాలు, బీట్‌లు, రిథమ్‌ జోడిస్తారు. గాయకులతో పాటు ప్రేక్షకులూ పాటలు పాడొచ్చు. చప్పట్లు కొడుతూ తాళానికి అనుగుణంగా కదలొచ్చు. కొన్ని కార్యక్రమాల్లో నృత్యం చేస్తూ కూడా భజనల్లో పాల్గొంటారు.

అంటే.. సంప్రదాయ భక్తి సంగీతాన్ని నేటి కచేరీ వాతావరణానికి దగ్గరగా తీసుకురావడమే ఈ విధానం. భజనల పవిత్రతను కాపాడుతూనే వాటిని కొత్త తరానికి పరిచయం చేయడం దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు. 

సంప్రదాయ భజనలకు దీనికి తేడా ఏంటి?
సాధారణ భజనల్లో ప్రశాంతంగా కూర్చొని లేదా ఒకే చోట చేరి భక్తి పాటలు పాడటం ఎక్కువగా కనిపిస్తుంది. భజన్ క్లబ్బింగ్‌లో మాత్రం వాతావరణం మరింత ఉత్సాహంగా ఉంటుంది. లైవ్‌ మ్యూజిక్‌, ఆధునిక బీట్‌లు, చప్పట్లు, పాటతో పాటు ప్రేక్షకుల భాగస్వామ్యం ఉంటాయి. అందుకే ఇది సాధారణ భజన కార్యక్రమానికి, మ్యూజిక్‌ కాన్సర్ట్‌కు మధ్య ఉన్న ఓ కొత్త తరహా అనుభూతిలా కనిపిస్తుంది.

మోదీ ఎలా పాల్గొన్నారు?
ఢిల్లీలోని దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ పార్క్‌లో శుక్రవారం భజన్ క్లబ్బింగ్‌ కార్యక్రమం జరిగింది. పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ప్రధాని మోదీ కార్యక్రమానికి హాజరై ప్రేక్షకుల మధ్య కూర్చున్నారు. భజనలు జరుగుతున్న సమయంలో చప్పట్లు కొడుతూ పాల్గొన్నారు. చేతిలో చిన్న వాయిద్యాన్ని (కంజర) వాయిస్తూ కనిపించారు. 

జనవరిలోనే ప్రస్తావించిన మోదీ
‘భజన్ క్లబ్బింగ్‌’ గురించి మోదీ ఈ ఏడాది జనవరిలో ‘మన్‌ కీ బాత్‌’లోనూ ప్రస్తావించారు. జెన్‌-జీ యువత ఈ విధానాన్ని స్వీకరిస్తోందని, ఆధ్యాత్మికతతో ఆధునికత కలిసిన రూపంగా ఇది కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. భజనల పవిత్రతను కాపాడుతూ కొత్త విధానంలో వాటిని అందిస్తున్నారని చెప్పారు. 

యువతకు ఎందుకు నచ్చుతోంది?
భజనలు వినడానికి తప్పనిసరిగా సంప్రదాయ కార్యక్రమానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. లైవ్‌ మ్యూజిక్‌, రిథమ్‌, సామూహిక భాగస్వామ్యంతో అనుభవించే అవకాశం ఈ విధానంలో ఉంటుంది. అందుకే సంప్రదాయ భక్తి సంగీతాన్ని ఆధునిక సంగీత వాతావరణంతో కలపాలనుకునే కార్యక్రమంగా ‘భజన్ క్లబ్బింగ్‌’ గుర్తింపు పొందుతోంది.
Advertisement
Narendra Modi
Bhajan Clubbing
Deen Dayal Upadhyaya
Modern Devotional Music
Delhi Spiritual Event
Gen Z Spiritual Trend

More Telugu News