దావూద్ ఇబ్రహీంపై ఐఎస్ఐ కొత్త వ్యూహం.. భారత్ భయంతో పక్కా ప్లాన్!

దావూద్ ఇబ్రహీంపై ఐఎస్ఐ కొత్త వ్యూహం.. భారత్ భయంతో పక్కా ప్లాన్!

Dawood Ibrahim ISI New Strategy and Pakistan Plan Due to Fear of India
  • దావూద్‌ ఇబ్రహీం విషయంలో పాక్ ఐఎస్ఐ వ్యూహం మార్పు
  • భారత్ ఆపరేషన్‌ భయంతో కరాచీ పోర్టు సమీపంలోకి నివాసం
  • మాదకద్రవ్యాల వ్యాపారం కంటే దావూద్‌ రక్షణకే అధిక ప్రాధాన్యం
  • డీ-కంపెనీలో అనారోగ్యం, వారసత్వ పోరుతో అంతర్గత సంక్షోభం
  • దావూద్‌ను కాపాడుకోవడం ఐఎస్ఐకి పెనుభారంగా మారిన వైనం
అంతర్జాతీయ ఉగ్రవాది, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం విషయంలో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అతడిని ఉపయోగించుకోవడం కంటే, అతడి భద్రతకే ఇప్పుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

ఈ క్రమంలోనే దావూద్ నివాసాన్ని కరాచీ పోర్టుకు సమీపంలోని ఒక సురక్షిత ప్రాంతానికి మార్చినట్లు సమాచారం. భవిష్యత్తులో భారత్ ఏదైనా ఆపరేషన్ చేపడితే, అక్కడి నుంచి సులభంగా తప్పించుకునేందుకే ఈ ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

గతేడాది మేలో జరిగిన 'ఆపరేషన్ సిందూర్' తర్వాత దావూద్ భద్రత విషయంలో ఐఎస్ఐ మరింత అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ దావూద్ భారత ఆపరేషన్‌లో మరణిస్తే, ఇన్నాళ్లూ తమ దేశంలో లేడని చెబుతున్న పాకిస్థాన్ వాదన అబద్ధమని ప్రపంచానికి తెలిసిపోతుందనే భయంతో ఐఎస్ఐ ఈ చర్యలు చేపడుతోంది. 

దావూద్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, ప్రస్తుతం కరాచీలోనే ఉన్నట్లు నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఐఎస్ఐకి దావూద్ వ్యవహారం కత్తి మీద సాములా మారింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడానికి దావూద్ నడిపే మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌పైనే ఐఎస్ఐ ఆధారపడింది. 

అయితే, ప్రస్తుతం డ్రగ్స్ వ్యాపారాన్ని విస్తరించడం కంటే దావూద్ ఆరోగ్యం, భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. దీంతో ఉగ్రసంస్థలకు నిధుల సేకరణపై ప్రభావం పడుతోంది.

మరోవైపు, డీ-కంపెనీలో అంతర్గత సమస్యలు కూడా తలెత్తాయి. దావూద్ అనారోగ్యంతో ఉండటంతో తదుపరి నాయకత్వం కోసం అతడి సోదరుడు అనీస్ ఇబ్రహీం, నమ్మినబంటు ఛోటా షకీల్ మధ్య వారసత్వ పోరు మొదలైంది. 

ఇదే సమయంలో భారత ప్రభుత్వం డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపడం, దావూద్ ముఖ్య అనుచరుడు సలీం డోలాను అరెస్ట్ చేయడంతో డీ-కంపెనీ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి.

ఈ పరిణామాలన్నీ ఐఎస్ఐకి తలనొప్పిగా మారాయి. ఒకవైపు ఎఫ్‌ఏటీఎఫ్ నిఘా, మరోవైపు డీ-కంపెనీ బలహీనపడటం పాక్‌కు ఇబ్బందికరంగా మారింది. దావూద్ నెట్‌వర్క్ బలహీనపడటం భారత భద్రతా సంస్థలకు సానుకూల అంశమని, దేశంలో మాదకద్రవ్యాల సమస్యను తగ్గించడానికి ఇది దోహదపడుతుందని అధికారులు విశ్లేషిస్తున్నారు.
Advertisement
Dawood Ibrahim
ISI Pakistan
D Company
Karachi Port
Chhota Shakeel
Indian Intelligence Agency

More Telugu News