ఏపీలో సచివాలయ సిబ్బందికి శుభవార్త.. ఆరేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు ఎస్జీపీ

ఏపీలో సచివాలయ సిబ్బందికి శుభవార్త.. ఆరేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు ఎస్జీపీ

Andhra Pradesh Secretariat Employees to get SGP scale after six years service
  • గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్
  • ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈ ప్రయోజనం వర్తింపు
  • రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.30 లక్షల మంది సిబ్బందికి లబ్ధి
  • 11వ పీఆర్సీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
  • ఇది ప్రమోషన్ కాదు, ఆర్థిక ప్రయోజనం మాత్రమేనని స్పష్టీకరణ
\ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (AAS) కింద స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్ (SGP) మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 15,000కు పైగా ఉన్న స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సుమారు 1.30 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ముఖ్యంగా 2019, 2020 సంవత్సరాల్లో తొలి విడతలో నియమితులైన ఉద్యోగులకు ఈ స్కేల్ ప్రయోజనం చేకూరనుంది. 11వ వేతన సవరణ కమిషన్ (PRC) చేసిన సిఫార్సులను అనుసరించి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తోంది.

అయితే, ఇది రెగ్యులర్ పదోన్నతి కాదని, కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. ఒకే పోస్టులో ఎక్కువ కాలం పనిచేస్తున్న ఉద్యోగులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌లో భాగంగానే ఈ స్పెషల్ గ్రేడ్ స్కేల్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. ఏఏఎస్ నిబంధనల ప్రకారం, ఉద్యోగులకు 6 ఏళ్ల సర్వీసుకు స్పెషల్ గ్రేడ్, ఆ తర్వాత 12, 18, 24 ఏళ్ల సర్వీసుకు తదుపరి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి.

తాజా ఉత్తర్వుల నేపథ్యంలో, అర్హులైన ఉద్యోగుల సర్వీస్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్‌ను వెంటనే మంజూరు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Andhra Pradesh Secretariat Employees
AP Government SGP Scale
Automatic Advancement Scheme AAS
Village Ward Secretariat Staff
AP 11th PRC Recommendations
AP Government Employee Benefits

More Telugu News