హైదరాబాద్‌లో లిఫ్ట్ ప్రమాదం నుంచి వ్యక్తిని కాపాడిన హైడ్రా

హైదరాబాద్‌లో లిఫ్ట్ ప్రమాదం నుంచి వ్యక్తిని కాపాడిన హైడ్రా

HYDRAA rescues person from lift accident in Hyderabad
  • మూసాపేటలో లిఫ్ట్ ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తి
  • లిఫ్టుకు, గోడకు మధ్య వేలాడుతూ నరకయాతన
  • గంటన్నర పాటు శ్రమించి కాపాడిన డీఆర్ఎఫ్ బృందం
  • గోడను పగలగొట్టి, హైడ్రాలిక్ కట్టర్‌తో రెస్క్యూ ఆపరేషన్
  • క్షతగాత్రుడి కాలికి ఫ్రాక్చర్.. ఆసుపత్రికి తరలింపు
హైదరాబాద్ నగరంలోని మూసాపేటలో ఆదివారం ఓ భవనంలో ప్రమాదం జరిగింది. లిఫ్టుకు, గోడకు మధ్య ఇరుక్కుని ప్రాణాపాయ స్థితిలో వేలాడుతున్న ఓ వ్యక్తిని హైడ్రా డీఆర్ఎఫ్ బృందం గంటన్నర పాటు శ్రమించి సురక్షితంగా కాపాడింది. ఈ ఘటన మూసాపేట ఆంజనేయ నగర్‌లోని ఓ మూడంతస్తుల భవనంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, బాధితుడు మురళి (40), తన భార్యతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రెండో అంతస్తుకు లిఫ్ట్‌లో వెళ్లారు. రెండో అంతస్తు రాగానే ఆయన బయటకు అడుగుపెట్టే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మూడో అంతస్తులో ఉన్న ఎవరో లిఫ్ట్ బటన్ నొక్కడంతో అది ఒక్కసారిగా పైకి కదిలింది. దీంతో మురళి ఒక కాలు రెండో అంతస్తులో, మరో కాలు లిఫ్ట్‌లో ఉండగానే ప్రమాదం జరిగింది. ఆయన శరీరం లిఫ్టుకు, గోడకు మధ్య ఇరుక్కుపోగా, కాలు గ్రిల్స్‌లో చిక్కుకుని వేలాడసాగారు.

లిఫ్ట్‌లోనే ఉన్న ఆయన భార్య కేకలు వేయడంతో అపార్ట్‌మెంట్ వాసులు వచ్చి కాపాడేందుకు విఫలయత్నం చేశారు. అనంతరం ఉదయం 9:15 గంటలకు హైడ్రా కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. వెంటనే కూకట్‌పల్లిలోని డీఆర్ఎఫ్ బృందం మార్షల్ జేడీవీ ప్రసాద్ నేతృత్వంలో 9:30 గంటలకే ఘటనా స్థలానికి చేరుకుంది. పరిస్థితి తీవ్రతను గమనించి సనత్‌నగర్ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు తెచ్చిన హైడ్రాలిక్ కట్టర్ సాయంతో, లిఫ్ట్ పక్కన ఉన్న గోడను బద్దలుకొట్టి సుమారు గంటన్నర పాటు శ్రమించి మురళిని బయటకు తీశారు. ఉదయం 10:50 గంటలకు ఈ ఆపరేషన్ పూర్తయింది.

భవనంలోని పాత గ్రిల్స్ లిఫ్ట్ సెన్సార్లు సరిగా పనిచేయకపోవడమే ఈ దుర్ఘటనకు కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మురళి కాలు లిఫ్టుకు, గోడకు మధ్య నలిగిపోవడంతో ఫ్రాక్చర్ అయింది. సిబ్బంది అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్పందించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన హైడ్రా డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందిని స్థానికులు అభినందించారు. 
Advertisement
HYDRAA
Hyderabad lift accident
Moosapet rescue operation
HYDRAA DRF team
Murali lift accident Hyderabad
Hyderabad Disaster Response Force

More Telugu News