షూటింగ్ పూర్తయి నాలుగేళ్లు.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ సినిమా

షూటింగ్ పూర్తయి నాలుగేళ్లు.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ సినిమా

Mrunal Thakur movie Pooja Meri Jaan to release directly on OTT after four years delay
  • నేరుగా జీ5లో విడుదల కానున్న ‘పూజా మేరీ జాన్’
  • మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషి ప్రధాన పాత్రధారులు
  • అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా స్ట్రీమింగ్
  • నాలుగేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న సస్పెన్స్ థ్రిల్లర్
  • ఒక హత్య చుట్టూ తిరిగే ఉత్కంఠభరిత కథాంశంతో రూపకల్పన
సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన నటి మృణాల్ ఠాకూర్. ఆమె బాలీవుడ్ నటి హుమా ఖురేషితో కలిసి నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'పూజా మేరీ జాన్'. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) వేదికగా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. విశేషమేమిటంటే, ఈ సినిమా చిత్రీకరణ సుమారు నాలుగేళ్ల క్రితమే పూర్తయినా, పలు కారణాల వల్ల విడుదల ఆలస్యమైంది.

ఈ సినిమా కథాంశం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగనుంది. పూజ (మృణాల్ ఠాకూర్) అనే యువతి, తన ప్రియుడు అనికేత్ మరణానికి కారణంగా నిందలు ఎదుర్కొంటుంది. ఆమె స్నేహితురాలు, లాయర్ అయిన సనా (హుమా ఖురేషి) ఒకవైపు స్నేహితురాలికి అండగా నిలవాలా, మరోవైపు ప్రియమైన స్నేహితుడు అనికేత్‌ను కోల్పోయిన బాధలో నిజానిజాలు తేల్చాలా అనే సంఘర్షణకు లోనవుతుంది. అనుమానాలు, ఆరోపణలు, పక్షపాత ధోరణుల మధ్య నలిగిపోయే పాత్రలో మృణాల్ నటించిందివ. వాస్తవానికి, ఊహకు మధ్య ఉన్న గీతను చెరిపేసేలా ఈ కథ ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్, అమర్ కౌశిక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవజ్యోత్ గులాటి దర్శకత్వం వహించగా, విజయ్ రాజ్, విక్రమ్ సింగ్ చౌహాన్ కీలక పాత్రల్లో నటించారు. సుమారు 2 గంటల నిడివి ఉన్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికెట్ జారీ చేసింది.

ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతూ జీ5 ఒక ప్రత్యేకమైన క్యాప్షన్‌ను పంచుకుంది. "కొన్ని కథలు మీరు చూసేదాన్ని ప్రశ్నించేలా చేస్తాయి. మరికొన్ని మీరు నమ్మేదాన్ని ప్రశ్నిస్తాయి. కానీ ఈ కథ ఈ రెండింటి మధ్య ఉన్న ప్రతీదాన్ని ప్రశ్నించేలా చేస్తుంది" అంటూ చేసిన ప్రకటన సినిమాపై అంచనాలను పెంచుతోంది.
Advertisement
Mrunal Thakur
Pooja Meri Jaan
Huma Qureshi
ZEE5 OTT Release
Maddock Films
Suspense Thriller Movie

More Telugu News