ఏపీలో 9 కొత్త రైల్వే లైన్లు.. పోర్టులకు పెరగనున్న కనెక్టివిటీ

ఏపీలో 9 కొత్త రైల్వే లైన్లు.. పోర్టులకు పెరగనున్న కనెక్టివిటీ

9 New Railway Lines in AP Port Connectivity to Increase
  • ఏపీలో కొత్త రైల్వే లైన్లు ఏర్పాటుకు రైల్వే శాఖ సన్నాహాలు
  • పశ్చిమ, మధ్య భారతం నుంచి ఏపీ పోర్టులకు మెరుగైన కనెక్టివిటీ లక్ష్యం
  • రాయలసీమ నుంచి పోర్టులకు దూరం తగ్గించేలా కీలక ప్రతిపాదనలు
  • తెలంగాణ నుంచి శ్రీశైలానికి రైలు మార్గం ఏర్పాటుకు ప్లాన్
  • ప్రయాణ సమయం, సరుకు రవాణా ఖర్చులు తగ్గించడమే ప్రధాన ఉద్దేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే నెట్‌వర్క్‌ను గణనీయంగా విస్తరించే లక్ష్యంతో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాలను అనుసంధానిస్తూ, ముఖ్యంగా ప్రధాన ఓడరేవులను కలుపుతూ మొత్తం 9 కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించింది. మధ్య, పశ్చిమ భారతదేశంలోని తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టులకు నేరుగా కనెక్టివిటీని పెంచడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశం. దీనివల్ల ప్రయాణ దూరంతో పాటు సరుకు రవాణా వ్యయం కూడా గణనీయంగా తగ్గనుంది.

రాయలసీమ, దక్షిణ ప్రాంతాల నుంచి ఓడరేవులకు అనుసంధానాన్ని మెరుగుపరచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా 120 కిలోమీటర్ల పొడవైన రాజంపేట - నెల్లూరు రైల్వే లైన్‌ను ప్రతిపాదించారు. ఇది రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల నుంచి కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులకు నేరుగా రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది. అలాగే, 41.5 కిలోమీటర్ల మేర గూడూరు - దుగరాజపట్నం పోర్టు లైన్‌కు సంబంధించి తుది లొకేషన్ సర్వే ప్రక్రియ కొనసాగుతోంది. 88.3 కిలోమీటర్ల పుత్తూరు - అత్తిపట్టు మార్గం చెన్నై ఓడరేవులకు దూరాన్ని తగ్గిస్తుండగా, దీనికి సంబంధించిన డీపీఆర్ ప్రస్తుతం సిద్ధమవుతోంది.

ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ప్రాంతాల కనెక్టివిటీకి కూడా రైల్వే శాఖ ప్రాధాన్యిమిచ్చింది. 150 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన చింతూరు - సామర్లకోట రైల్వే లైన్ ద్వారా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కాకినాడ పోర్టుతో నేరుగా సంబంధం ఏర్పడుతుంది. అదేవిధంగా, ఇప్పటికే మంజూరైన ఒడిశాలోని తెరుబాలి - గుణుపూర్ (73.6 కి.మీ) లైన్ ములపేట పోర్టుకు సరుకు రవాణాను మరింత సులభతరం చేయనుంది.

వీటితో పాటు, తెలంగాణ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి రైలు మార్గాన్ని అందుబాటులోకి తెచ్చేలా 290 కిలోమీటర్ల పొడవైన సికింద్రాబాద్ - శ్రీశైలం - మార్కాపురం లైన్ కూడా ప్రతిపాదనల్లో ఉంది.

గద్వాల - మాచర్ల (184.2 కి.మీ), దొనకొండ - ఒంగోలు (119.6 కి.మీ), దూపాడు - బేతంచెర్ల (53.9 కి.మీ) లైన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మార్గాలు దొనకొండ, ఓర్వకల్ పారిశ్రామిక ప్రాంతాలను ఓడరేవులతో అనుసంధానిస్తాయి. ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కితే రాష్ట్ర వాణిజ్య, ఆర్థిక రంగాలు సరికొత్త పుంతలు తొక్కుతాయని భావిస్తున్నారు.
Advertisement
Andhra Pradesh Railway Projects
New Railway Lines
AP Port Connectivity
Indian Railways
South Central Railway
AP Infrastructure Development

More Telugu News