ఇందిరమ్మ ఇళ్లు: ఈ వారంలోనే లబ్ధిదారులకు కేటాయింపు పత్రాలు

ఇందిరమ్మ ఇళ్లు: ఈ వారంలోనే లబ్ధిదారులకు కేటాయింపు పత్రాలు

Indiramma Houses Allocation Documents To Beneficiaries This Week
  • ఇప్పటికే 5,521 మందిని అర్హులుగా గుర్తించిన హౌసింగ్ బోర్డు
  • మధ్యవర్తులను నమ్మి డబ్బులు ఇవ్వొద్దని లబ్ధిదారులకు గట్టి హెచ్చరిక
  • కేటాయింపు పత్రంతో పాటే చెల్లింపుల వివరాలు, బ్యాంకు ఖాతా అందజేత
  • ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ
  • విడతల వారీగా లబ్దిదారుడు చెల్లించాల్సింది రూ.6 లక్షలు 
హైదరాబాద్‌లోని ఇందిరమ్మ టవర్స్ పథకం కింద ఎంపికైన ఎల్ఐజీ (తక్కువ ఆదాయ వర్గం) లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వారంలోనే వారికి ఫ్లాట్ల కేటాయింపు పత్రాలను అందజేయనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, కమిషనర్ వి.పి. గౌతమ్ ఆదివారం ప్రకటించారు. అర్హత పొందిన లబ్ధిదారులకు అధికారిక కేటాయింపు పత్రంతో పాటు, మొదటి విడత చెల్లించాల్సిన మొత్తం, గడువు, అధికారిక బ్యాంకు ఖాతా వివరాలు అందిస్తామని తెలిపారు.

లక్కీ డ్రా ద్వారా ఎంపికైన మొత్తం 7,340 మందిలో ఇప్పటివరకు సుమారు 6,660 మందికి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశామని గౌతమ్ వివరించారు. వీరిలో 5,521 మందిని అర్హులుగా నిర్ధారించామని, మిగిలిన వారి పరిశీలన కూడా ఈ వారంలోనే ముగుస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే అర్హులందరికీ పత్రాలు జారీ చేస్తారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆయన కీలక సూచనలు చేశారు. చెల్లింపులు కేవలం ప్రభుత్వం నిర్దేశించిన అధికారిక ఖాతాలో మాత్రమే చేయాలని, మధ్యవర్తులు, బ్రోకర్లను నమ్మి వారికి నగదు లేదా కమీషన్ రూపంలో డబ్బులు ఇవ్వొద్దని హెచ్చరించారు. ఎంపిక కాని వారికి రూ.10,000 ఈఎండీ రీఫండ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని గుర్తుచేశారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల 'క్యూర్' పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు. ఒక్కో ఫ్లాట్‌పై ప్రభుత్వం రూ. 5 లక్షల సబ్సిడీ అందిస్తుండగా, లబ్ధిదారులు రూ. 6 లక్షలు విడతలవారీగా చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని లేదా 040-24603572 నంబరును సంప్రదించాలని అధికారులు సూచించారు.
Advertisement
Indiramma Housing Scheme
Telangana Housing Board
VP Gautham
Hyderabad LIG Flats
Indiramma Towers Allocation
Telangana Government Housing Subsidy

More Telugu News