అల్వాల్‌లో దారుణం: ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం!

అల్వాల్‌లో దారుణం: ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం!

Alwal Horror Eight Men Gang Rape Intermediate Student in Hyderabad
  • నెలల తరబడి బాలికపై నిందితుల పైశాచికం
  • మత్తుమందు, గంజాయికి బానిస చేసి ఘోరానికి పాల్పడిన నిందితులు
  • బాధితురాలు తప్పించుకుని ఇంటికి చేరడంతో వెలుగులోకి దారుణం
  •  నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్‌ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై నెలల తరబడి 8 మంది వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ ఘోరం బయటపడగా, పోలీసులు 8 మంది నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మచ్చబొల్లారానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతోంది. పదో తరగతిలో ఉన్నప్పుడు జెర్రీ వరుణ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్ని నెలల క్రితం, ఆ యువకుడు చాక్లెట్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, తన కారులోనే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో మొదలైన నరకం నెలలపాటు కొనసాగింది.

ఆ తర్వాత జెర్రీ వరుణ్ ద్వారా రొమాల వరుణ్ అనే మరో యువకుడు పరిచయమయ్యాడు. అతడు బాలికకు మద్యం, సిగరెట్లు, గంజాయి వంటి మత్తు పదార్థాలు అలవాటు చేసి, కొంపల్లిలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. వీరే కాకుండా, డేవిడ్ వరుణ్ అనే ఇంకో వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై, మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించాడు.

కుమార్తె ప్రవర్తనలో మార్పు గమనించిన తండ్రి ఈ నెల 9న ఆమెను మందలించడంతో, బాలిక ఇల్లు వదిలి బొల్లారం రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ పరిచయమైన నీరజ్ అనే వ్యక్తి, తన స్నేహితుడు విక్కీని పిలిపించాడు. ఇద్దరూ కలిసి బాలికకు మత్తుమందు ఇచ్చి, వేర్వేరుగా అత్యాచారం చేశారు. అక్కడితో ఆగకుండా, విక్కీ తన మరో స్నేహితుడు నిఖిల్‌తో కలిసి బాలికను దూలపల్లిలోని ఓయో గదికి తీసుకెళ్లాడు. అక్కడ నిఖిల్, అతడి ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ రాత్రి బాధితురాలిని విక్కీ తన ఇంట్లో బంధించాడు. 10వ తేదీన అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక మళ్లీ బొల్లారం రైల్వే స్టేషన్‌కు చేరుకోగా.. విక్కీ, అతడి స్నేహితుడు గణేశ్ కలిసి అడ్డుకున్నారు. వారు బాలికను బలవంతంగా మత్తులోకి దించి మేడ్చల్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి, అక్కడ రైలులో మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మల్కాజిగిరికి చేరుకుని, ధూల్‌పేటకు ఆటోలో వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా బాధితురాలు వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది.

ఇంటికి వచ్చిన బాలిక, జరిగిన ఘోరాన్ని కుటుంబ సభ్యులకు వివరించడంతో వారు వెంటనే అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
Alwal Gang Rape
Hyderabad POCSO Case
Intermediate Student Assault
Alwal Police Investigation
Hyderabad Crime News
Jerry Varun Case

More Telugu News