ఆరోపణలు ఆపకపోతే ప్రజాగ్రహం తప్పదు: వైసీపీకి మంత్రి దుర్గేశ్ హెచ్చరిక

ఆరోపణలు ఆపకపోతే ప్రజాగ్రహం తప్పదు: వైసీపీకి మంత్రి దుర్గేశ్ హెచ్చరిక

Kandula Durgesh warns YSRCP to stop false allegations on Mega DSC
  • మెగా డీఎస్సీపై వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తోందన్న మంత్రి దుర్గేశ్ 
  • రికార్డు సమయంలో 16,347 ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశామని వెల్లడి
  • డీఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ 335 పిటిషన్లు వేసిందని ఆరోపణ
  • వైసీపీ ఎమ్మెల్సీ పిల్‌పై హైకోర్టు మందలించడం వారికి చెంపపెట్టు అని వ్యాఖ్య
కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తీవ్రంగా ఖండించారు. నిరాధారమైన ఆరోపణలు మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో కేవలం 148 రోజుల రికార్డు వ్యవధిలోనే 16,347 ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని దుర్గేశ్ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దక్కకూడదనే దురుద్దేశంతో వైఎస్సార్‌సీపీ ఏకంగా 335 పిటిషన్లు వేసిందని ఆరోపించారు. ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తీవ్రంగా మందలించడం వైఎస్సార్‌సీపీకి తగిలిన గట్టి చెంపపెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు.

నోటిఫికేషన్ విడుదల నుంచి మెరిట్ జాబితాల ప్రకటన, ఫిర్యాదుల పరిష్కారం వరకు ప్రతి అంశాన్ని పబ్లిక్ డొమైన్‌లో ఉంచి నియామక ప్రక్రియను చేపట్టామని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయంలో రోస్టర్, హారిజాంటల్ విధానాలను కచ్చితంగా పాటించామన్నారు. కనీస అవగాహన లేకుండా ‘బ్రిడ్జ్’ క్రీడపై వైఎస్సార్‌సీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసిందని, ఇప్పుడు మంత్రి నారా లోకేశ్ మరో డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయని దుర్గేశ్ పేర్కొన్నారు.
Advertisement
Kandula Durgesh
AP Mega DSC 2024
YSRCP Allegations
Andhra Pradesh Teacher Recruitment
Nara Lokesh DSC Announcement
AP Tourism Minister

More Telugu News