యాపిల్‌ కొత్త సీఈఓ జాన్‌ టెర్నస్‌కు వేతనం ఎంతో తెలుసా?

John Ternus Apple New CEO Salary and Compensation Details
  • యాపిల్‌ కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌ బాధ్యతలు
  • టెర్నస్‌ ప్యాకేజ్ 58 మిలియన్‌ డాలర్లు
  • టిమ్‌ కుక్‌ కొత్త ప్యాకేజీ 47 మిలియన్‌ డాలర్లు
  • టెర్నస్‌ వార్షిక వేతనం 3 మిలియన్‌ డాలర్లు
  • ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కుక్‌కు 2 మిలియన్‌ డాలర్ల వేతనం
యాపిల్‌ కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌ బాధ్యతలు చేపట్టారు. దీంతో సంస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టెర్నస్‌ సీఈఓగా.. టిమ్‌ కుక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొత్త బాధ్యతల్లోకి వెళ్లారు. ఈ ఇద్దరి కొత్త వేతన ప్యాకేజీలను యాపిల్‌ వెల్లడించింది.

కొత్త సీఈఓ జాన్‌ టెర్నస్‌కు ఈ ఆర్థిక సంవత్సరానికి దాదాపు 58 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీ అందుతుంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.551 కోట్లు. ఇందులో 3 మిలియన్‌ డాలర్లు వార్షిక వేతనం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 55 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లు కూడా ప్యాకేజీలో ఉన్నాయి.

మరోవైపు టిమ్‌ కుక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా సుమారు 47 మిలియన్‌ డాలర్లు అందుకోనున్నారు. ఇందులో 2 మిలియన్‌ డాలర్లు వేతనం. మరో 45 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లు ఉన్నాయి. సీఈఓగా ఉన్నప్పుడు కుక్‌కు 3 మిలియన్‌ డాలర్ల వార్షిక వేతనం ఉండేది.

టెర్నస్‌కు ఇచ్చే షేర్లలో 75 శాతం పనితీరుపై ఆధారపడి ఉంటాయి. ఎస్‌అండ్‌పీ 500లోని ఇతర కంపెనీలతో పోలిస్తే యాపిల్‌ షేరు పనితీరును బట్టి వాటి విలువ మారుతుంది. మిగిలిన 25 శాతం షేర్లు నాలుగేళ్లలో దశలవారీగా అందుతాయి.

కుక్‌ షేర్లలో 50 శాతం పనితీరుపై ఆధారపడతాయి. మిగిలినవి నాలుగేళ్లలో దశలవారీగా అందుతాయి. కుక్‌ పదవీ విరమణ చేసినా.. కొన్ని షేర్లు నిర్ణయించిన తేదీల్లో పొందే అవకాశం కల్పించారు.

సీఈఓగా 2025లో కుక్‌ మొత్తం 74.3 మిలియన్‌ డాలర్లు అందుకున్నారు. ఇందులో 3 మిలియన్‌ డాలర్ల వేతనం, 12 మిలియన్‌ డాలర్ల నగదు ప్రోత్సాహకాలు, 57.5 మిలియన్‌ డాలర్ల షేర్లు ఉన్నాయి.

కుక్‌ 2011లో స్టీవ్‌ జాబ్స్‌ తర్వాత యాపిల్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆయన స్థానంలో టెర్నస్‌ వచ్చారు. ఈ కాలంలో యాపిల్‌ మార్కెట్‌ విలువ 350 బిలియన్‌ డాలర్ల నుంచి 4.5 ట్రిలియన్‌ డాలర్లకు పైగా పెరిగింది.
Advertisement
John Ternus
Apple CEO Salary
Tim Cook Executive Chairman
Apple Compensation Package
John Ternus Annual Pay
Apple Leadership Change

More Telugu News