నేపాల్‌ ఆకస్మిక వరదలకు కారణం ఇదే.. తేల్చిన అమెరికా

  • నేపాల్‌ వరదలకు భూకంపం కారణం కాదని యూఎస్‌జీఎస్‌ స్పష్టీకరణ
  • భారీ హిమనదం కూలిపోవడమే విపత్తుకు కారణమని వెల్లడి
  • నేపాల్‌లో ఇప్పటివరకు 157 మృతదేహాల వెలికితీత
  • వందలాది మంది గల్లంతు
  • గల్లంతైన వారిలో 142 మంది భారతీయులు
నేపాల్‌ను అతలాకుతలం చేసిన భారీ వరదలకు భూకంపం కారణం కాదని ‘అమెరికా భూగర్భ సర్వే సంస్థ’ (యూఎస్‌జీఎస్‌) స్పష్టం చేసింది. తొలుత భూకంపంగా నమోదైన ప్రకంపనల వెనుక భారీ హిమనదం కూలిపోవడమే కారణమని వెల్లడించింది. మంచు, రాళ్లతో కూడిన భారీ కొండచరియలు విరిగిపడటంతో లెండే నదిలో విపరీతమైన వరద పోటెత్తిందని తెలిపింది.

తొలుత 4.4 తీవ్రతగా నమోదు
నేపాల్‌ కాలమానం ప్రకారం ఉదయం 8.37 గంటలకు నేపాల్‌-చైనా సరిహద్దు సమీపంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తొలుత యూఎస్‌జీఎస్‌ ప్రకటించింది. తర్వాత ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి అసలు విషయం వెల్లడించింది. అక్కడ ఎలాంటి భూకంపం సంభవించలేదని స్పష్టం చేసింది.

మంచు, రాళ్ల కొండచరియలే కారణం
ప్లానెట్‌ ల్యాబ్స్‌ ఉపగ్రహ చిత్రాల ప్రాథమిక పరిశీలనలో లెండే నది పరివాహక ప్రాంతంలో భారీ హిమనదం కూలినట్లు తేలింది. మంచు, రాళ్లు, మట్టితో కూడిన ప్రవాహం ఒక్కసారిగా కిందకు దూసుకొచ్చింది. ఈ ఘటన నేపాల్‌-చైనా రసువాగఢి సరిహద్దు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో జరిగింది.

157 మృతదేహాల వెలికితీత
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటివరకు 157 మృతదేహాలను నేపాల్‌ పోలీసులు వెలికితీశారు. శిథిలాలు, బురదలో చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగుతోంది. వరదల సమయంలో 403 మంది పర్యాటకుల ఆచూకీ కొంతసేపు తెలియలేదు. వీరిలో 341 మంది విదేశీయులు ఉన్నారు. తప్పిపోయిన వారిలో 142 మంది భారతీయులు కూడా ఉన్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసం
టిబెట్‌ వైపు గ్యిరోంగ్‌లో ముగ్గురు మరణించగా, 265 మంది గల్లంతైనట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. రసువా, ధాదింగ్‌, నువాకోట్‌ జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. ఇళ్లు, వాహనాలు, చెట్లు బురదలో కూరుకుపోయాయి. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు నిరంతరం తిరుగుతున్నాయి.

సహాయక చర్యల్లో సైన్యం
విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతినడంతో పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. గల్లంతైన వారి వివరాల కోసం ప్రజలు నేపాల్‌ సైనిక కేంద్రాల వద్దకు చేరుతున్నారు. బాధితుల కోసం అన్ని ప్రభుత్వ వనరులను వినియోగిస్తామని ప్రధాని బాలేంద్ర షా ప్రకటించారు.
Advertisement

More Telugu News