సినిమాను మించిన కథ.. 40 ఏళ్లు పోలీసుల కళ్లుగప్పిన ఖైదీ.. టీచర్‌గా పనిచేసి, అవార్డులు పొంది రిటైర్!

Sandela Veeranna life convict evades police for 40 years retires as award winning teacher
  • పెరోల్‌పై బయటకొచ్చి 40 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న జీవిత ఖైదీ
  • ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉత్తమ టీచర్ అవార్డు కూడా అందుకున్న వైనం
  • ఈ ఏడాది మేలో అరెస్ట్ చేసిన పోలీసులు
  • శిక్ష మినహాయింపును సవాలు చేసిన భార్య
  • పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. జైళ్ల శాఖ పనితీరుపై తీవ్ర ఆగ్రహం
  • పెరోల్ ఖైదీల కోసం ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశం
జీవిత ఖైదు శిక్ష పడిన ఓ వ్యక్తి పెరోల్‌పై బయటకు వచ్చి ఏకంగా 40 ఏళ్ల పాటు పోలీసుల కళ్లుగప్పి స్వేచ్ఛగా జీవించాడు. ఈ సుదీర్ఘ కాలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి, ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకుని, పదవీ విరమణ కూడా చేశాడు. సినిమా కథను తలపించే ఈ వింత ఘటన మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్నకు ఓ కేసులో 1983లో వరంగల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అదే ఏడాది డిసెంబర్‌లో పెరోల్‌పై విడుదలైన అతడు.. 1984 మార్చిలో తిరిగి జైలుకు లొంగిపోవాల్సి ఉన్నా పరారయ్యాడు. అప్పటి నుంచి మహబూబాబాద్ జిల్లాలోనే ఉంటూ ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం సంపాదించాడు. 2004లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు కూడా అందుకుని, 2013లో రిటైరయ్యాడు.

దాదాపు 40 ఏళ్ల తర్వాత, ఈ ఏడాది మే 16న వరంగల్ సెంట్రల్ జైలు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వీరన్నను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అతడికి మూడేళ్ల పాటు పెరోల్, శిక్షా మినహాయింపు నిరాకరిస్తూ జైళ్ల శాఖ మెమో జారీ చేసింది. దీనిపై వీరన్న భార్య చారమ్మ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ టి. మాధవీ దేవి ధర్మాసనం.. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే తప్పించుకు తిరిగాడని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన న్యాయస్థానం, జైళ్ల శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని వ్యాఖ్యానించింది. పెరోల్‌పై వెళ్లిన ఖైదీలను పర్యవేక్షించేందుకు పటిష్ఠమైన ట్రాకింగ్ వ్యవస్థతో పాటు కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని జైళ్ల శాఖను ఆదేశించింది.
Advertisement
Sandela Veeranna
Telangana teacher arrest
Life convict jumped parole
Mahabubabad award winning teacher
Warangal Central Jail
Best teacher award winner prisoner

More Telugu News