బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల గాలా డిన్నర్ లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu Naidu attends BRICS Sports Ministers Gala Dinner in Visakhapatnam
  • విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్ ఏర్పాటుకు సీఎం ప్రతిపాదన
  • క్రీడలు ఆరోగ్యం, ఉపాధి, ఆర్థిక ప్రగతికి దోహదపడతాయని వ్యాఖ్య
  • అపెక్స్ 2036 ద్వారా 2036 ఒలింపిక్స్‌కు క్రీడాకారులను సిద్ధం చేస్తామని వెల్లడి
  • అమరావతి స్పోర్ట్స్ సిటీ, నెల్లూరు క్రీడా ఉపకరణాల హబ్ ఏర్పాటు ప్రణాళికలు
  • క్రీడా రంగంలో కలిసి పనిచేద్దామని బ్రిక్స్ దేశాలకు ముఖ్యమంత్రి పిలుపు
భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు, యువత ఏకం చేస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న బ్రిక్స్ దేశాల యువజన, క్రీడల మంత్రుల సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన గాలా డిన్నర్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా, బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు విశాఖ కేంద్రంగా ‘బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్‌’ను ఏర్పాటు చేయాలని ఆయన కీలక ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక సమావేశాలకు విశాఖ నగరం వేదిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విశాఖ నగరం ప్రాముఖ్యతను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. "సిటీ ఆఫ్ డెస్టినీ"గా పేరుగాంచిన విశాఖపట్నం, భారత తూర్పు తీరానికి ఒక ఆభరణం వంటిదని అభివర్ణించారు. తూర్పు కనుమలు, బంగాళాఖాతం కలిసే ఈ ప్రాంతంలో ప్రకృతి అందాలు, ఆర్థిక అభివృద్ధి అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఉద్యోగ, ప్రతిభా రంగాల్లో వరుసగా రెండో ఏడాది దేశంలోనే 'నంబర్‌వన్ సిటీ ఆన్ ద రైజ్'గా విశాఖ గుర్తింపు పొందిందని, మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల్లో ఒకటిగా నిలిచిందని గుర్తుచేశారు. వ్యూహాత్మక మారిటైమ్ గేట్‌వేగా, టెక్నాలజీ-ఇన్నోవేషన్ హబ్‌గా ఎదుగుతున్న విశాఖ, నూతన భారతదేశ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు.

క్రీడలతో ఆరోగ్యం, ఆర్థిక ప్రగతి

సాంకేతికత ఆధారిత జీవనశైలి వల్ల యువతలో ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, దీనిని అధిగమించేందుకు క్రీడలు, యోగా, ధ్యానం ఎంతగానో దోహదపడతాయని సూచించారు. క్రీడలు కేవలం పోటీలు మాత్రమే కాదని, అవి సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి నిదర్శనమని అన్నారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే బలమైన సమాజం, ఉత్పాదక శక్తి కలిగిన దేశం నిర్మితమవుతుందని పేర్కొన్నారు. క్రీడలు అథ్లెట్లు, కోచ్‌లు, ఈవెంట్ మేనేజర్లకు ఉపాధి కల్పించడమే కాకుండా, స్పోర్ట్స్ టూరిజం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని వివరించారు.

ఏపీలో క్రీడారంగ అభివృద్ధికి బృహత్ ప్రణాళికలు

రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలను చంద్రబాబు వివరించారు. 'అపెక్స్ 2036' కార్యక్రమం ద్వారా గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులను గుర్తించి, 2036 ఒలింపిక్స్‌తో పాటు ఇతర అంతర్జాతీయ పోటీలకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇందులో భాగంగా 28 జిల్లాల్లో 56 రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూళ్లను ఏర్పాటు చేసి, వాటిని రాష్ట్రస్థాయి అకాడమీలతో అనుసంధానిస్తామని చెప్పారు. అమరావతిలో 'స్పోర్ట్స్ సిటీ'ని, నెల్లూరులో క్రీడా ఉపకరణాల తయారీ హబ్‌ను, విశాఖను అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్ కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ బృహత్ ప్రణాళికలో భాగస్వాములు కావాలని, క్రీడా ఉపకరణాల తయారీ, శిక్షణ, స్పోర్ట్స్ టూరిజం వంటి రంగాల్లో కలిసి పనిచేయాలని బ్రిక్స్ దేశాలను ఆయన ఆహ్వానించారు. భవిష్యత్ ఛాంపియన్లను తయారు చేయడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
Advertisement
Chandrababu Naidu
BRICS Sports Ministers Meeting
Visakhapatnam
AP Sports Policy Apex 2036
BRICS Youth and Sports Innovation Network
Amaravati Sports City

More Telugu News