హైదరాబాద్‌లో భారీ పన్ను ఎగవేత గుట్టురట్టు

Huge tax evasion racket busted in Hyderabad
  • హైదరాబాద్‌లో భారీ పన్ను ఎగవేత రాకెట్ బట్టబయలు
  • అక్రమ పాన్ మసాలా యూనిట్‌పై సీజీఎస్టీ అధికారుల దాడులు
  • సుమారు రూ. 160 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు నిర్ధారణ
  • భారీగా ముడిసరుకు, 40 యంత్రాలు స్వాధీనం.. కీలక వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్‌లో భారీ జీఎస్టీ ఎగవేత గుట్టును హైదరాబాద్ సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) అధికారులు రట్టు చేశారు. నగర శివార్లలోని ఒక రేకుల షెడ్డులో రహస్యంగా నిర్వహిస్తున్న పాన్ మసాలా, పొగాకు తయారీ యూనిట్‌పై దాడి చేసి, సుమారు రూ. 160 కోట్ల మేర పన్ను ఎగవేతను గుర్తించారు. ఈ అక్రమ దందాను నిర్వహిస్తున్న కీలక వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ యూనిట్‌లో ఎటువంటి అనుమతులు లేకుండానే పాన్ మసాలా, సుగంధ జర్దా వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తనిఖీల సమయంలో లెక్కల్లో చూపని 40 ప్యాకింగ్ యంత్రాలను అధికారులు కనుగొన్నారు. ఈ ఫ్యాక్టరీలో మొత్తం 56 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ తయారైన సరుకును జీఎస్టీ, హెచ్‌ఎస్‌ఎన్‌ఎస్ సెస్, సెంట్రల్ ఎక్సైజ్ సుంకాలు చెల్లించకుండానే మార్కెట్‌కు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది.

దాడుల్లో భాగంగా రవాణాకు సిద్ధంగా ఉన్న రూ. 76 లక్షల విలువైన సరుకుతో పాటు, 5,500 కిలోల రెడీమేడ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 2,015 కిలోల పాన్ మసాలా మిశ్రమం, 810 కిలోల పొగాకు, ప్యాకింగ్ మెటీరియల్‌తో పాటు అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న రెండు వాహనాలను సీజ్ చేశారు.

పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై 2026 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పన్ను నిబంధనల నుంచి తప్పించుకోవడానికే ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. పట్టుబడిన స్టాక్, యంత్రాల సామర్థ్యం, పనిచేస్తున్న కార్మికుల సంఖ్య ఆధారంగా మొత్తం పన్ను ఎగవేత రూ. 160 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ రాకెట్‌లో ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేయగా, ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
Advertisement
Hyderabad Central GST
Pan Masala Tax Evasion
Illegal Tobacco Manufacturing
GST Raid Hyderabad

More Telugu News