ఫ్రాన్స్‌లో తొలి హిందూ ఆలయం.. భారత్‌లో తయారీ, పారిస్‌లో నిర్మాణం

France first Hindu temple made in India and built in Paris
  • ఫ్రాన్స్‌లో మొట్టమొదటి సంప్రదాయ హిందూ దేవాలయ నిర్మాణం పూర్తి
  • పారిస్‌లోని బుస్సీ-సెయింట్-జార్జెస్‌లో సెప్టెంబర్‌లో ప్రారంభోత్సవం
  • భారతదేశంలో చెక్కిన రాళ్లతో ఫ్రాన్స్‌లో ఆలయ నిర్మాణం
  • 13 రోజుల పాటు ఘనంగా 'ఫెస్టివల్ ఆఫ్ కల్చర్' వేడుకలు
  • మహంత్ స్వామి మహారాజ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు
ఫ్రాన్స్‌లో హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ మొట్టమొదటి భారీ హిందూ దేవాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పారిస్‌లోని బుస్సీ-సెయింట్-జార్జెస్ ప్రాంతంలో బీఏపీఎస్ (బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ) నిర్మించిన ఈ స్వామినారాయణ్ హిందూ మందిరాన్ని సెప్టెంబర్ లో అంగరంగ వైభవంగా ప్రారంభించనున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 2 నుంచి 14వ తేదీ వరకు 13 రోజుల పాటు 'ఫెస్టివల్ ఆఫ్ కల్చర్' పేరిట ప్రత్యేక సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నారు.

ఈ ప్రారంభోత్సవ వేడుకలను బీఏపీఎస్ ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహారాజ్ తన ఆశీస్సులతో పర్యవేక్షించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు, శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ ఆలయ ప్రారంభోత్సవం, సాంస్కృతిక ఉత్సవాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్సంగ సభల్లో మార్చి, ఏప్రిల్ నెలల్లోనే బీఏపీఎస్ అధికారికంగా ప్రకటించింది. యూకే, యూర‌ప్‌ దేశాల బీఏపీఎస్ హెడ్ యోగవివేక్‌దాస్ స్వామి ప్రత్యేక వీడియో సందేశం ద్వారా ఈ ఆలయ చారిత్రక ప్రాధాన్యతను, ఉత్సవాల వివరాలను తెలియజేశారు.

ఈ ఆలయ నిర్మాణంలో ఒక విశేషం ఉంది. ఆలయానికి అవసరమైన రాళ్లను భార‌త్‌ నుంచి ఫ్రాన్స్‌కు త‌ర‌లించ‌డం జ‌రిగింది. ఈ రాళ్ల‌ను మ‌న ద‌గ్గ‌ర‌ శిల్పులతో చెక్కించి, వాటిని అక్కడ ఆల‌య నిర్మాణంలో ఉప‌యోగించ‌డం జ‌రిగింది. "ఈ ఆలయం భారతదేశంలో తయారై, ఫ్రాన్స్‌లో నిర్మించబడింది. ఇది మాకు ఎంతో గర్వకారణం" అని ఫ్రాన్స్‌లోని ప్రవాస భారతీయురాలు భావి పరేఖ్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తర్వాత ఇప్పుడు ఈ ఆలయ ప్రారంభోత్సవం తమకు మరో ముఖ్యమైన సందర్భమని ఆమె తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం ఈ ఆలయాన్ని సందర్శించాలని బీఏపీఎస్‌తో అనుబంధం ఉన్న మరో ప్రవాస భారతీయుడు ఆహ్వానించారు. సెప్టెంబర్‌లో జరిగే 13 రోజుల కార్యక్రమాలకు అందరూ హాజరు కావాలని ఆయన కోరారు.

ఆలయ ప్రారంభోత్సవానికి ఇప్పటికే శిఖరాలు, మధ్య గోపురంపై 'కలశ', 'ధ్వజ దండ పూజలు' వంటి పవిత్ర కార్యక్రమాలను నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య శాంతి, సామరస్యం, శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మహంత్ స్వామి మహారాజ్, సీనియర్ స్వాములు, భక్తులు 'పారిస్ మందిర్ మహోత్సవని జై!' అంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ ఆలయ ప్రారంభంతో ఫ్రాన్స్‌లోని హిందూ సమాజ చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కానుండగా, ఇది సందర్శకులకు గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నారు.
Advertisement
BAPS Swaminarayan Sanstha
First Hindu Temple France
Paris Swaminarayan Mandir
Mahant Swami Maharaj
Bussy Saint Georges
Festival of Culture Paris

More Telugu News