కెరీర్ మేనేజర్‌గా కన్నతల్లి.. రెండంటే రెండే వారాల్లోనే ఉద్యోగం నుంచి తీసేసిన కూతురు.. అస‌లు స‌మ‌స్య అదేన‌ట‌!

Avanti Nagral fires mother from career manager job in two weeks and reveals the reason
  • తన కెరీర్‌కు మేనేజర్‌గా తల్లిని నియమించుకున్న యువతి
  • రెండు వారాల్లోనే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న వైనం
  • అతి ప్రేమ, భద్రతపై ఆందోళనే ఇందుకు కారణమని వెల్లడి
  • కూతురిని కాపాడటానికే తల్లి చూస్తోందని, మేనేజ్‌మెంట్ కాదని స్పష్టీక‌ర‌ణ‌
  • లింక్డ్‌ఇన్‌లో తన అనుభవాన్ని పంచుకున్న అవంతి నాగ్రాల్
వ్యాపార, వృత్తిపరమైన విషయాల్లో కుటుంబ సభ్యులను భాగస్వాములను చేయడం కొన్నిసార్లు ఎలాంటి అనుభవాలను ఇస్తుందో చెప్పే ఓ ఆసక్తికర ఉదంతం వెలుగులోకి వచ్చింది. అవంతి నాగ్రాల్ అనే ఓ కళాకారిణి, తన కెరీర్ వ్యవహారాలు చూసుకోవడానికి స్వయంగా కన్నతల్లినే మేనేజర్‌గా నియమించుకున్నారు. కానీ, కేవలం రెండు వారాల్లోనే ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని తన లింక్డ్‌ఇన్ పోస్టులో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హార్వర్డ్‌లో చదువుకునే ముందు వచ్చిన గ్యాప్ ఇయర్‌లో అవంతి నాగ్రాల్ సంగీతం, థియేటర్‌పై పూర్తి దృష్టి పెట్టారు. ప్రదర్శనలకు సంబంధించిన ఈమెయిల్స్, పారితోషికాల (రేట్లు) చర్చలు, ప్రయాణాలు, కొత్త అవకాశాల కోసం సంప్రదింపులు వంటి పనుల కోసం ఆమెకు ఒక సహాయం అవసరమైంది. అదే సమయంలో తన కెరీర్‌ను విజయవంతంగా మలచుకున్న అనుభవం ఉన్న ఆమె తల్లి, ఖాళీ సమయం ఉండటంతో తానే మేనేజర్‌గా ఉంటానని ముందుకొచ్చారు. ఇది మంచి ఆలోచనగానే అవంతికి మొదట అనిపించింది.

అయితే, ఈ ఏర్పాటు ఎక్కువ కాలం నిలవలేదు. "రెండు వారాల్లోనే మా అమ్మను ఉద్యోగంలోంచి తీసేశాను (ఫైర్ చేశాను)" అని అవంతి తన పోస్టులో రాశారు. దీనికి కారణం ఆమె సరిగా పట్టించుకోకపోవడం కాదని, అతిగా పట్టించుకోవడమేనని వివరించారు. "ఆమె నన్ను పట్టించుకోలేదని కాదు. అవసరానికి మించి ఎక్కువగా కేర్ తీసుకున్నారు. నాకు వచ్చే ప్రతి ఆఫర్‌ను ఆమె తిరస్కరించేవారు. ఎందుకంటే నేను అంతకంటే మెరుగైన వాటికి అర్హురాలినని ఆమె భావించేవారు" అని అవంతి తెలిపారు.

అంతేగాక తన కూతురి భద్రత విషయంలో తల్లి తీవ్ర ఆందోళన చెందేవారు. ఆలస్యంగా జరిగే రాత్రి షోలు, అపరిచిత నగరాలకు ప్రయాణాలు, ముందుగా అంచనా వేయలేని జన సమూహాలు వంటి విషయాల్లో ఆమె తీవ్ర అభ్యంతరాలు చెప్పేవారు. ఈ క్రమంలో అవంతి ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహించారు. తన తల్లి ఒక కెరీర్ మేనేజర్‌గా కాకుండా, ఒక కూతురిని కాపాడే తల్లిగా ప్రవర్తిస్తున్నారని ఆమెకు అర్థమైంది. 'ఈ రెండు పనులు వేర్వేరు' అని ఆమె నొక్కి చెప్పారు. ఈ అనుభవం తర్వాత వ్యక్తిగత, వృత్తిపరమైన నిర్ణయాలను వేరుగా చూడగల ప్రొఫెషనల్ మేనేజర్లతో ఆమె పనిచేశారు. 
Advertisement
Avanti Nagral
Mother as manager
Career management
Family and business
Avanti Nagral LinkedIn
Professional career advice

More Telugu News