ఇంటి చుట్టూ పాములు వస్తున్నాయా? ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చూడండి!

Snakes entering your house surroundings check if you are making these mistakes
  • ఇంటి చుట్టూ గడ్డి ఎక్కువగా పెరగనివ్వొద్దు
  • దట్టమైన పొదలు, చెట్లను ఇంటికి దూరంగా ఉంచాలి
  • పెరట్లో నీరు నిలిచే ప్రదేశాలను తొలగించాలి
  • ఎలుకలు, కప్పలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించొద్దు 
  • కట్టెలు, పాత వస్తువులను ఇంటి పక్కన పోగేయొద్దు
ఇంటికి దగ్గర్లో పాము కనిపిస్తే చాలామందికి గుండెల్లో దడ మొదలవుతుంది. అయితే పాములు యాదృచ్ఛికంగా రావు. ఇంటి చుట్టూ ఉండే కొన్ని చిన్న చిన్న పరిస్థితులు వాటికి అనుకూలంగా మారుతాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం... పొడవుగా పెరిగిన గడ్డి, నీరు నిలిచే ప్రదేశాలు, పక్షులకు వేసే గింజలు.. ఇలా మనకు సాధారణంగా కనిపించే విషయాలే పాములకు ఆహారం, నీరు, దాక్కునే చోటును అందించొచ్చు. ముఖ్యంగా భారతీయ ఇళ్లలో కనిపించే తోటలు, పెరళ్లు, చెట్ల ప్రాంతాలకు వర్తించే 10 అంశాలు ఇవే..

1. గడ్డిని ఎక్కువగా పెరగనివ్వడం
ఇంటి చుట్టూ గడ్డి బాగా పెరిగితే పాములకు దాక్కోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది. పొడవైన గడ్డి మధ్య నుంచి అవి మన కంటపడకుండా కదలగలవు. ఎలుకలు, కప్పలు వంటి వాటికీ ఇదే ప్రాంతం ఆశ్రయంగా మారుతుంది. దీంతో పాములకు ఆహారం కూడా అందుబాటులోకి వస్తుంది. క్రమం తప్పకుండా గడ్డిని కత్తిరించడం మంచిది.

2. చెట్లు, పొదలు దట్టంగా పెరగడం
ఇంటికి ఆనుకుని దట్టంగా పెరిగిన పొదలు పాములకు చల్లని, చీకటి ప్రదేశాన్ని అందిస్తాయి. గోడలు, షెడ్లు, గ్యారేజీలకు తగిలేలా కొమ్మలు పెరగకుండా చూసుకోవాలి. చెట్లు, పొదలకు కొంత ఖాళీ ఉంచితే పాములు దాక్కునే అవకాశాలు తగ్గుతాయి.

3. ఇంటి చుట్టూ నీరు నిలవడం
వర్షం తర్వాత పెరట్లో చిన్న గుంతల్లో నీరు నిలిచిపోతుందా? అయితే జాగ్రత్త. అలాంటి తడి ప్రాంతాలు కప్పలు, పురుగులు, నత్తల వంటి జీవులను ఆకర్షిస్తాయి. ఇవి పాములకు ఆహారంగా మారొచ్చు. నీరు నిలిచే ప్రదేశాలను గుర్తించి నేలను చదును చేయాలి.

4. పక్షులకు గింజలు ఇంటి దగ్గరే వేయడం
పక్షుల కోసం పెట్టే గింజలు కింద పడటం సహజం. వాటిని తినేందుకు ఎలుకలు రావచ్చు. ఎలుకలు ఉన్న చోట పాములకు ఆహారం సిద్ధంగా ఉన్నట్టే. అందుకే పక్షుల కోసం ఏర్పాటు చేసే ఫీడర్లను ఇంటికి మరీ దగ్గరగా పెట్టకపోవడం మంచిది.

5. పెంపుడు జంతువులకు బయట ఆహారం
కుక్కలు, పిల్లులకు బయట ఆహారం పెడితే మిగిలిపోయిన ఆహారం చుట్టూ పురుగులు, ఎలుకలు చేరవచ్చు. వాటిని వెంబడిస్తూ పాములు కూడా రావొచ్చు. బయటే ఆహారం పెట్టాల్సి వస్తే మిగిలిపోయిన పదార్థాలను వెంటనే తొలగించాలి. పెట్‌ ఫుడ్‌ను బయట బహిరంగంగా ఉంచకూడదు.

6. కట్టెలు, పాత వస్తువులను పోగేయడం
కట్టెల కుప్పలు, పాత పైపులు, పలకలు, ఇనుప సామగ్రి మధ్య చీకటి ఖాళీలు ఏర్పడతాయి. ఇవి పాములకు దాక్కునే ప్రదేశాలుగా మారవచ్చు. కట్టెలను నేలకు నేరుగా తగలకుండా కొంత ఎత్తులో ఉంచడం మంచిది. ఇంటి గోడకు ఆనించి కుప్పలు పెట్టకపోవడం మరింత సురక్షితం.

7. ఇంటి గోడల దగ్గర ఖాళీలు
గోడలు, తలుపులు, కిటికీలు, షెడ్లు, గ్యారేజీల దగ్గర చిన్న రంధ్రాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు. వాటిలో ఎలుకలు చేరొచ్చు. తర్వాత వాటి వెంట పాములు కూడా రావచ్చు. కాబట్టి ఇంటి చుట్టూ ఉన్న పగుళ్లు, రంధ్రాలను ఎప్పటికప్పుడు మూసివేయాలి.

8. ఎక్కువగా మల్చింగ్ వేయడం
మొక్కల చుట్టూ వేసే మల్చింగ్ తేమను నిలిపి ఉంచుతుంది. మందంగా పేరుకున్న మల్చ్‌లో పురుగులు, నత్తలు, చిన్న జీవులు చేరుతాయి. చల్లగా, తడిగా ఉండే ఈ ప్రాంతాలు పాములకు కూడా అనుకూలంగా మారొచ్చు. అందుకే మల్చ్‌ను అవసరానికి మించి వేయకపోవడం మంచిది.

9. తోటలో ఆకులు, పండ్లు, చెత్త పేరుకుపోనివ్వడం
రాలిన ఆకులు, పండ్లు, గింజలు తోటలో అలాగే ఉంటే పురుగులు, ఎలుకలు చేరే అవకాశం పెరుగుతుంది. అవి పాములకు ఆహారంగా మారొచ్చు. కంపోస్ట్‌, చెత్త డబ్బాలను కూడా మూతపెట్టి ఉంచాలి. తోటలో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడం మంచిది.

10. ఎలుకలను పట్టించుకోకపోవడం
ఇంట్లో లేదా పెరట్లో ఎలుకల కదలికలు కనిపిస్తున్నాయంటే అది ముఖ్యమైన హెచ్చరిక. ఎలుకలు, కప్పలు, బల్లులు ఎక్కువగా ఉంటే పాములకు ఆహారం దొరుకుతున్నట్టే. ఎలుకల బొరియలు, రెట్టలు కనిపిస్తే వెంటనే వాటి నియంత్రణపై దృష్టిపెట్టాలి.

పాము కనిపిస్తే ఏం చేయాలి?
ఈ జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు పాము కనిపించొచ్చు. దాన్ని పట్టుకోవడానికి లేదా దగ్గరగా వెళ్లి ఏ జాతికి చెందిందో గుర్తించడానికి ప్రయత్నించకూడదు. ముఖ్యంగా విషపూరితమా? కాదా? అని నిర్ధారించుకునేందుకు పామును సమీపించడం ప్రమాదకరం. పాములు తరచూ కనిపిస్తుంటే శిక్షణ పొందిన వన్యప్రాణి నియంత్రణ సిబ్బంది సాయం తీసుకోవడం సురక్షితం.
Advertisement
Snakes
Snake prevention tips
Home safety measures
Garden maintenance
Pest control for snakes
Wildlife safety tips

More Telugu News