తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్... బ్రహ్మోత్సవాల్లో ఈ సేవలు రద్దు

Tirumala Srivari Brahmotsavams Arjitha Sevas and Special Darshans Cancelled
  • సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
  • బ్రహ్మోత్సవాల వేళ అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ
  • వృద్ధులు, దివ్యాంగులతో పాటు పలు ప్రత్యేక దర్శనాలు కూడా నిలిపివేత
  • భక్తులు మార్పులను గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు తిరుమలలో అన్ని రకాల ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

టీటీడీ ప్రకటన ప్రకారం, బ్రహ్మోత్సవాల సమయంలో అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ వంటి ఆర్జిత సేవలను పూర్తిగా నిలిపివేయనున్నారు. వీటితో పాటు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు కల్పించే ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా రద్దు చేశారు. ఈ మార్పులను భక్తులందరూ గమనించి, టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారికి అత్యధిక దర్శన సమయం కేటాయించేందుకు టీటీడీ ఈ చర్యలు చేపట్టింది. ఈ తొమ్మిది రోజుల పాటు స్వామివారి వాహన సేవలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం అధికారిక ప్రకటన జారీ చేసింది.
Advertisement
Tirumala Tirupati Devasthanams
Srivari Brahmotsavams
Arjitha Sevas Cancelled
Special Entry Darshan
Tirumala Temple News
Tirumala Pilgrims Update

More Telugu News