నామినేషన్ పత్రాలను రేవంత్ రెడ్డి సొంతంగా నింపగలరా?: ధర్మపురి అరవింద్ సవాల్

Dharmapuri Arvind challenges Revanth Reddy on filling nomination papers
  • ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి రేంత్ రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారన్న అరవింద్
  • విద్య పట్ల కనీస చిత్తశుద్ధి లేని వ్యక్తి అంటూ విమర్శలు
  • రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారైందని వ్యాఖ్య

ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం చేసిన వ్యాఖ్యలు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


విద్య పట్ల కనీస చిత్తశుద్ధి లేని వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండటం ఏమాత్రం సరైనది కాదని విమర్శించారు. సీఎం వద్ద ఉన్న విద్యాశాఖ బాధ్యతలను వెంటనే మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తే బాగుంటుందని సూచించారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను రేవంత్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించిన అరవింద్... ఎవరి సహకారం కూడా తీసుకోకుండా సీఎం నామినేషన్ పత్రాలనైనా సొంతంగా నింపగలరా? అని సవాల్ విసిరారు.


రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారైందని... కనీసం బ్లాక్ బోర్డులు, చాక్ పీసులు, సరైన మరుగుదొడ్లు కూడా లేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఒక్క ప్రభుత్వ పాఠశాలనైనా సందర్శించారా? అని ప్రశ్నించారు. ఉన్న పాఠశాలలను బాగుచేయడం వదిలేసి, కొత్త నిర్మాణాల పేరుతో కమీషన్లు దండుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా విద్యా రంగానికి ప్రాధాన్యమిచ్చి సమస్యలను పరిష్కరించాలని ఎంపీ డిమాండ్ చేశారు.

Advertisement
Dharmapuri Arvind
Revanth Reddy
Telangana Education Ministry
BJP Telangana
Engineering Students
Nizamabad MP

More Telugu News