ఈ20 పెట్రోల్‌ కల్తీపై కేంద్రం స్పష్టత.. రోజుకు 12 సార్లు నాణ్యత పరీక్షలు

E20 Petrol Center clarification Quality tests 12 times a day
  • 87 వేలకు పైగా బంకుల్లో రోజుకు 8-12 సార్లు పరీక్షలు
  • క్లోరైడ్‌ కలుషితం దేశంలో రెండు బంకుల్లోనే గుర్తించినట్లు వెల్లడి
  • 2 వేలకుపైగా ఇంధన నమూనాలను పరీక్షించినట్లు తెలిపిన కేంద్రం
  • కల్తీ బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
  • ఈ20లో ఇథనాల్‌కు 99.6 శాతం స్వచ్ఛత తప్పనిసరి
  • నాణ్యత లేని 302 ఇథనాల్‌ ట్యాంకర్లను తిరస్కరించినట్లు వెల్లడి
ఈ20 పెట్రోల్‌ నాణ్యతపై వస్తున్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇంధన నాణ్యతను చమురు మార్కెటింగ్‌ సంస్థలు (ఓఎంసీలు) నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం 87 వేలకు పైగా పెట్రోల్‌ బంకుల్లో రోజుకు 8 నుంచి 12 సార్లు కలుషిత/కల్తీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

దేశంలో ఇప్పటివరకు క్లోరైడ్‌ కలుషితానికి సంబంధించిన రెండు ఘటనలు మాత్రమే గుర్తించినట్లు పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ రెండు పెట్రోల్‌ బంకుల్లో ఇంధన విక్రయాలను వెంటనే నిలిపివేసినట్లు పేర్కొంది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2 వేలకుపైగా ఇంధన నమూనాలను క్లోరైడ్‌, సల్ఫైడ్‌ కలుషితానికి పరీక్షించినట్లు వెల్లడించింది. ఎక్కడైనా కలుషితం లేదా కల్తీ బయటపడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇంధన సరఫరా వ్యవస్థ మొత్తాన్ని ఓఎంసీలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించినట్లు తెలిపింది.

ఈ20లో కలిపే ఇథనాల్‌ తప్పనిసరిగా బీఐఎస్‌ ఐఎస్‌ 15464 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని కేంద్రం తెలిపింది. ఇథనాల్‌ స్వచ్ఛత కనీసం 99.6 శాతం ఉండాలని పేర్కొంది. ప్రతి సరఫరాతో పాటు నాణ్యత ధ్రువీకరణ నివేదిక తప్పనిసరిగా ఉండాలని వెల్లడించింది.

ఇథనాల్‌ నిల్వకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రతి ట్యాంకర్‌ను స్వీకరించే ముందు పైభాగం, దిగువ భాగం నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. ప్రతి డెలివరీకి ముందు కూడా నాణ్యత తనిఖీలు తప్పనిసరిగా చేస్తున్నట్లు పేర్కొంది.

2024 జులై నుంచి 2026 జూన్‌ వరకు నాణ్యత ప్రమాణాలు పాటించని 302 ట్యాంకర్లను తిరస్కరించినట్లు కేంద్రం వెల్లడించింది. వీటిలో దాదాపు 10,500 కిలోలీటర్ల ఇథనాల్‌ ఉన్నట్లు తెలిపింది.
Advertisement
E20 Petrol
Fuel Quality Testing
Ministry of Petroleum and Natural Gas
Ethanol Blended Petrol
Oil Marketing Companies
BIS IS 15464 Standards

More Telugu News