నా పర్సనల్ లైఫ్ గురించి మీకేం తెలుసు?: పుకార్లపై అనుపమ పరమేశ్వరన్ ఘాటు స్పందన
- చర్చనీయాంశంగా మారుతున్న అనుపమ సోషల్ మీడియా పోస్టులు
- లవ్ బ్రేకప్ బాధతోనే ఆవేదనతో కూడిన పోస్టులు పెడుతోందంటున్న నెటిజన్లు
- తన సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేయాలనేది తన సొంత నిర్ణయమన్న అనుపమ
యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సందేశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తమిళ నటుడు ధృవ్ విక్రమ్‌తో ప్రేమాయణం ముగిసిందని, ఆ బ్రేకప్ బాధలోనే ఆవేదనతో కూడిన పోస్టులు పెడుతోందంటూ నెట్టింట పుకార్లు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన అనుపమ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
"నా అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఏం పోస్ట్ చేయాలనేది పూర్తిగా నా వ్యక్తిగత హక్కు, నా సొంత నిర్ణయం. నా బాధను ఇతరుల ముందు ప్రదర్శించి సానుభూతి పొందాల్సిన అవసరం నాకు లేదు. ఒక సాధారణ మహిళగా జీవితంలో ఎదుర్కొనే మార్పుల గురించే నేను మాట్లాడాను. ఆ మార్పులను సమాజంతో ధైర్యంగా పంచుకోవడం నాకు గర్వంగా అనిపిస్తోంది. నా జీవితం, నా పర్సనల్ లైఫ్ గురించి బయట ఉన్న మీకేం తెలుసు? ఇది నా ఇన్‌స్టాగ్రామ్, నాకు నచ్చినవి నేను పోస్ట్ చేసుకుంటాను. నన్ను ప్రశ్నించడానికి మీరెవరు?" అంటూ ఆమె ఘాటుగా సమాధానమిచ్చింది.
మరోవైపు రొటీన్ కథలకు భిన్నమైన ప్రాజెక్టులను ఎంచుకుంటున్న అనుపమ, ప్రస్తుతం 'క్రేజీ కల్యాణం' అనే చిత్రంలో నటిస్తోంది. దర్శకుడు బద్రప్ప సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, నరేశ్, అఖిల్ ఉడ్డెమారి కీలక పాత్రలు పోషిస్తున్నారు. పర్సనల్ లైఫ్‌పై వచ్చిన వదంతులకు సూటిగా చెక్ పెట్టిన అనుపమ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.